అక్రమ ట్రాఫి‘కింగ్’ నసీర్!
సాక్షి, హైదరాబాద్: నిషేధిత ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జీహాదీ అల్ ఇస్లామి (హుజి)తో సంబంధమున్న పాకిస్తానీ మహమ్మద్ నసీర్‌కు సంబంధించి కొత్త కోణం వెలుగుచూసింది. ఇప్పటికే భారత్-బంగ్లా సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను దాటించానని అంగీకరించిన నసీర్... మన దేశం నుంచి ఇతర దేశాలకు మనుషుల అక్రమ రవాణా చేసే గ్యాంగ్‌లతోనూ తనకు సం బంధాలున్నాయని వెల్లడించినట్టు తెలుస్తోంది. 2010లో భారత్‌లో అడుగుపెట్టి హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లతోపాటు హైదరాబాద్‌లోనూ మకాం పెట్టిన నసీర్..
ఎంతోమంది అమ్మాయిలు, అబ్బాయిలకు ఉద్యోగాలను ఎర చూపి విదేశాలకు అక్రమ రవాణా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే విధం గా ఇతర దేశాల నుంచి భారత్‌కు అక్రమంగా వచ్చిన వారికీ సహకరించినట్లు తెలుస్తోంది.
మాల్దానే అడ్డాగా: పశ్చిమ బెంగాల్‌లో ఉన్న భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన మాల్దా చెక్‌పోస్టు వద్ద విధులు నిర్వహించే కొందరితో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకొని మనుషులను అక్రమ రవాణా చేసే ముఠాతో నసీర్ తన కార్యకలాపాలు సాగించాడని తెలుస్తోంది. డబ్బు ఆశచూపి యువకులను సరిహద్దులు దాటించేవాడని అలాగే వ్యభిచార కూపాలు నిర్వహించే వారికి అమ్మాయిలను సరఫరా చేశాడని సమాచారం.
హుజి ఉగ్రవాది అబ్దుల్ జబ్బార్ ఆదేశాల మేరకు యువతకు జీహాదీ సాహిత్యాన్ని నూరిపోశాడని తెలిసింది. పోలీసులకు చిక్కడానికి 6 నెలల ముందు నుంచీ జల్‌పల్లిలో ఉంటున్న నసీర్ 15 మందికి పాస్‌పోర్టులు ఇప్పించాడని దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి ఎంత మందిని తరలించి ఉంటాడన్నదానిపై ఆరా తీస్తున్నారు.
దర్జాగా తిరిగిన జబ్బార్..
హుజీ ఉగ్రవాది అబ్దుల్ జబ్బార్ కొన్ని నెలల పాటు భారత్‌లో సంచరించాడు. 2013లో పశ్చిమ బెంగాల్ సరిహద్దు మాల్దా చెక్‌పోస్టు దాటించి బంగ్లాదేశ్ పంపాడని నసీర్ కేసు విచారణలో వెలుగులోకి వచ్చింది. జబ్బార్‌తో కలిసి ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్‌లలో తిరిగానని, అయితే జబ్బార్ హైదరాబాద్‌కు రాలేదని నసీర్ చెప్పినట్టు సమాచారం. మాల్దా నుంచి భారత్‌లోకి అక్రమంగా అడుగుపెట్టిన జబ్బార్ 2013 దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల తర్వాత కూడా యధేచ్ఛగా తిరిగినా పోలీసు, నిఘా వర్గాలు గుర్తించలేదు.
కస్టడీ కోరుతూ నేడు పిటిషన్
నసీర్‌తో సహా పట్టుబడిన ఆరుగురు అనుమానితుల్ని విచారించాలని సీసీఎస్ ఆధీనంలోని సిట్ అధికారులు నిర్ణయించారు. న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఈ నిందితుల్ని సిట్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు విచారించే అవకాశం ఉంది. మరోపక్క దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన జియా ఉర్ రెహమన్ అలియాస్ వఖాస్‌ను దేశ సరిహద్దులు దాటించినట్లూ నసీర్‌పై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ కేసుల్ని దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులూ నసీర్‌ను విచారించనున్నారు.