'కోహినూర్ ను పాకిస్థాన్ కు తెప్పించండి'
లాహోర్ : తెలుగువారి అమూల్య సంపదగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రాన్ని ఇంగ్లండ్ (యూకే) నుంచి వెనక్కి తెప్పించాలని పాక్ ప్రభుత్వాన్ని కోరుతూ అక్కడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. జావెద్ ఇక్బాల్ జఫ్రీ అనే న్యాయవాది లాహోర్ హైకోర్టులో గురువారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. మహారాజా రంజిత్‌సింగ్ మనవడు దిలీప్‌సింగ్ నుంచి కోహినూర్ వజ్రాన్ని లాక్కుని బ్రిటన్‌కు తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.
న్యాయవాది జావెద్ తన పిటిషన్‌లో .. 1953లో రాణీ ఎలిజబెత్-II కిరీటంలో పొదగబడిన కోహినూర్ వజ్రం మీద ఆమెకు ఎటువంటి హక్కు లేదని పేర్కొన్నారు. 105 క్యారెట్లు ఉన్న ఈ వజ్రం విలువ బిలియన్లలో ఉంటుందని, నిజానికి కోహినూర్ వజ్రం పంజాబ్ ప్రావిన్స్ సాంస్కృతిక వారసత్వ సంపద అని చెప్పారు.
1849లో పంజాబ్.. బ్రిటీషర్ల దురాక్రమణకు గురైన నేపథ్యంలో సిక్కు చక్రవర్తుల ఆస్తుల జప్తులో భాగంగా పాకిస్థాన్లోని లాహోర్ నుంచి ఈ కోహినూర్ వజ్రం బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చేరిందని జావెద్ పిటిషన్లో చెప్పుకొచ్చారు. అలా లాహోర్ నుంచి చేతులు మారిన వజ్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నుంచి తిరిగి పాకిస్థాన్‌కు తీసుకురావాల్సిందిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు.
కొన్ని వందల ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా కొల్లూరు గనులలో ఈ కోహినూర్ వజ్రం బయటపడింది. మాల్వా రాజు మహలక్ దేవ్ దీని తొలి యజమానిగా కొందరు చరిత్రకారులు భావిస్తారు. తర్వాతికాలంలో కాకతీయుల సామ్రాజ్యానికి చేరింది. ఆ తర్వాత మొఘల్ రాజుల పరమయ్యింది. కోహినూర్ కు ఆ పేరు (కోహ్-ఇ-నూర్ అంటే కాంతి శిఖరం) పెట్టింది కూడా మొఘలులే.
అక్కడి నుంచి చేతులు మారి ఆంగ్లేయుల వశమైన ఈ వజ్రం ప్రస్తుతం లండన్లోని ఓ మ్యూజియంలో ఉంది. దాన్ని తిరిగివ్వాల్సిందిగా భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ఈ క్రమంలో కోహినూర్ వజ్రం మాదేనంటూ, తిరిగి పాకిస్థాన్కు తెప్పించాలంటూ.. కొత్తగా పాక్ కోర్టులో పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.