GST గందరగోళం | Implementation of goods and services tax from July 1 | Sakshi
Sakshi News home page

GST గందరగోళం

Published Fri, Jun 30 2017 12:26 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

GST గందరగోళం - Sakshi

GST గందరగోళం

గ్రేటర్‌ సామాన్య, వ్యాపార వర్గాల్లో గందరగోళం
లాభ నష్టాలపై బేరీజు..  కొరవడిన అవగాహన
నిత్యావసర సరుకుల ధరలు దిగివస్తాయని ఆశ
సినిమా, విందు, వినోదాలు ప్రియమే..
జూలై 1 నుంచి వస్తు, సేవల పన్ను అమలు


జూలై ఒకటో తేదీ సమీపిస్తుండడంతో ‘జీఎస్‌టీ’ (గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌) సిటీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ పన్ను విధానం అమలైతే ఎవరికి లాభం.. ఎవరికి భారం అన్నది అన్ని వర్గాల్లో చర్చనీయాంశమైంది. నిత్యావసర సరుకుల ధరలు దిగివస్తాయా? అని సామాన్యులు.. లగ్జరీ వస్తువుల మాటేంటి? అని ఉన్నతవర్గాలు, మా పరిస్థితి ఎలా ఉంటుందోనని మధ్య తరగతి.. ఎవరికి వారు ఆలోచనలతో తలమునకలయ్యారు. మరోవైపు నగరంలోని 20 శాతం మంది వ్యాపారులు వ్యాట్‌ నుంచి జీఎస్‌టీలోకి మారనేలేదు. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ గురించిన సందేహాలు.. లాభనష్టాలపై ‘సాక్షి’ విశ్లేషణాత్మక కథనం.

‘ఒకే దేశం.. ఓకే పన్ను’ విధానాన్ని అమలు చేసేందుకు ప్రవేశపెడుతున్న ‘వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)పై గ్రేటర్‌లో విభిన్న వర్గాల్లో పలు అనుమానాలుతలెత్తుతున్నాయి. ఏ వస్తువుపై ఎంత పన్ను పరిధిలోకి వస్తుందన్న అంశంపై స్పష్టత లేకపోవడంతో ఇటు వ్యాపారులు, అటు వినియోగదారుల్లో అయోమయం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్టీ జూలై 1 నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో కొన్ని వస్తువులు, సేవల ధరలు తగ్గుతుండగా.. మరికొన్ని పెరుగుతున్నాయి. జీఎస్టీ అమలుపై పలు వివిధ వర్గాల ప్రజలు, వ్యాపారుల అభిప్రాయం తెలుసుకునేందుకు గ్రేటర్‌ వ్యాప్తంగా ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. జీఎస్టీ పన్నుతో ఆయా రంగాలపై పడనున్న ప్రభావం.. వ్యాపారులు, వినియోగదారుల అభిప్రాయాలపై ప్రత్యేక కథనం..

20 శాతం డీలర్లు దూరందూరం..
వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలుపై డీలర్లకు అవగాహన కొరవడింది. వ్యాట్‌ నుంచి జీఎస్టీలో మార్పు కోసం మూడు నాలుగు పర్యాయాలు అవకాశం కల్పించినప్పటికీ నగరంలో సుమారు 20 శాతం మంది డీలర్లు ఇంకా నమోదు చేసుకోలేదు. నగర పరిధిలో సుమారు 1.26 లక్షలమందికి పైగా వ్యాపారులు వ్యాట్‌ డీలర్లుగా నమోదవగా అందులో 80 శాతం డీలర్లు మాత్రమే జీఎస్టీ కింద మార్పు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా జీఎస్టీలో నమోదు కోసం మరో మారు ప్రత్యేక పోర్టల్‌ ద్వారా అవకాశం కల్పించారు. ఇప్పటికే జీఎస్టీలో నమోదైన డీలర్లకు ప్రొవిజనల్‌ ఐడీలను సైతం కేటాయించారు. జీఎస్టీ నెట్‌వర్క్‌ ద్వారా ఐడీలతో పాటు జీఎస్టీ విధి విధానాల ఫార్మాట్‌లను సైతం జారీ చేశారు. ఐడీలు పొందిన డీలర్లు  జీఎస్టీకి అనుగుణంగా తమ వ్యాపార సంస్థలోని బిల్లింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జీఎస్టీలో నమోదు చేసుకున్న డీలర్లు తమ రిటర్న్‌లను 3 బీ ఫార్మెట్‌లో ఆగస్టు వరకు సమర్పించవచ్చు. సెప్టెంబర్‌ నుంచి మాత్రం ప్రతినెలా రిటర్న్‌లను పక్కాగా జీఎస్టీ ఫార్మెట్‌లోనే సమర్పించాలి.

స్పష్టత లేని రైలు చార్జీలు..
ట్రైన్‌ చార్జీలపైన ఇప్పటికీ స్పష్టత లేదు. జనరల్, స్లీపర్‌ క్లాస్‌ చార్జీల్లో ఎలాంటి మార్పులు ఉండవని, ఏసీ చార్జీలు మాత్రం స్వల్పంగా పెరగవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే  వస్తువుల పార్శిల్‌  చార్జీలు కూడా కొంత పెరిగే అవకాశం ఉంది.

ఏసీ రెస్టారెంట్లలో బాదుడు..
నాన్‌ఏసీ రెస్టారెంట్లు, దాబాల్లో ధరలు స్వ ల్పంగా తగ్గనున్నాయి. ప్రస్తుతం సేవా పన్ను, వ్యాట్, స్వచ్ఛభారత్‌ సెస్, క్రిషి సెస్‌ అంటూ 20 శాతం వినియోగదారుల నుంచి హోటళ్లు పిండుతున్న పన్నులు తగ్గనున్నాయి. జూలై నుంచి స్టార్‌ హోటళ్లలో 28 శాతం పన్ను పడనుంది. నాన్‌ ఏసీ రెస్టారెంట్లలో పన్ను 12 శాతం ఉండగా, ఏసీ రెస్టారెంట్లలో 18 శాతంగా నిర్ణయించారు. రూ.50 లక్షల కన్నా తక్కువ టర్నోవర్‌ ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల్లో ఈ పన్ను 5 శాతానికి పరిమితం చేశారు. సేవా రుసుం మాత్రం ఆయా రెస్టారెంట్లను బట్టి వసూలు చేస్తారు.

నిత్యావసరాలకు నో ఫికర్‌..
బియ్యం, పప్పులు, కూరగాయలు, పండ్లు వంటి సరుకులను జీఎస్టీ నుంచి మినహాయించారు. దీంతో ఆయా వస్తువుల ధరలు తగ్గి సామాన్యులకు ఊరట లభించనుంది. ఇంటి సరుకుల కొనుగోలుకు ప్రతినెలా చేసే ఖర్చులో రూ.500 నుంచి రూ.వెయ్యి మిగిలే అవకాశముంది. కాగా కొన్ని బ్రాండెడ్‌ నిత్యావసరాల కొనుగోలుపై ఐదుశాతం పన్ను పడనున్నట్టు బేగంబజార్‌ హోల్‌సేల్‌ వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.

సినిమా వినోదం భారం
థియేటర్లో సినిమా టికెట్‌ ధరలను జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. రూ.100 కన్నా తక్కువ ధర ఉన్న టికెట్లపై 18 శాతం, రూ.100 కంటే ఎక్కువున్న టికెట్‌ ధరపై 28 శాతంగా వేశారు. జూలై 1 నుంచి పాత వినోదపు పన్ను స్థానే కొత్త పన్నుల శ్లాబు అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం సినిమా టికెట్ల ధరలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వినోదపు పన్ను ఆధారంగా విధిస్తున్నారు. ఇది సున్నా నుంచి 110 శాతం వరకూ ఉంది. తెలంగాణలో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏసీ థియేటర్‌లో రూ.70 ఉన్న గరిష్ట టికెట్‌ ధర రూ.120కి చేరింది. మల్టీప్లెక్స్‌లు మినహా మిగతా సినిమాహాళ్లకు వీటిని వర్తింపజేశారు.

స్వల్పంగా డీటీహెచ్, కేబుల్‌..  
కేబుల్‌ సర్వీస్, డీటీహెచ్‌ ధరలు స్వల్పంగా  పెరగనున్నాయి. ప్రస్తుత ట్యాక్స్‌ 15 శాతం ఉంది. జీఎస్టీ అమలైతే మరో 3 శాతం పెరిగి  18 శాతానికి చేరుతుంది. అంతకు మించి వసూలు చేసే వెసులుబాటు లేదు. అయితే దీనిపై తమకు ఏ విధమైన స్పష్టతా లేదంటూ నగరంలోని కేబుల్, డీటీహెచ్‌ నిర్వాహకులు చెబుతున్నారు.

పెరగనున్న మొబైల్‌ డేటా ..
మొబైల్‌ డేటా ప్లాన్స్‌   ప్రస్తుతం ఉన్న ట్యాక్స్‌కు 3 శాతం పెరగనున్నాయి. ప్రస్తుత ట్యాక్స్‌ 15 శాతం చెల్లిస్తున్నాం. జీఎస్టీ అమలైతే 18 శాతానికి పెరగనుంది.

విమాన చార్జీలపై2 శాతం భారం
అన్ని డోమెస్టిక్, ఇంటర్నేషనల్‌ విమాన సర్వీసులపైనా సుమారు 2 శాతం చార్జీలు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు ప్రస్తుతం ఫ్లెక్సీఫైర్‌ చార్జీలు విధిస్తున్నారు. జీఎస్టీతో ఈ చార్జీలు మరింత పెరగవచ్చు. ఉదాహరణకు జూలై  5న హైదరాబాద్‌ నుంచి బెంగళూర్‌కు ఎయిర్‌ ఇండియా చార్జీ రూ.6,698 వరకు ఉంది. దీనిపైన 2 శాతం అదనంగా అంటే రూ.150 వరకు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికుల డిమాండ్‌ మేరకు ఏ రోజుకు ఆ రోజు చార్జీల్లో  మార్పులు చోటుచేసుకోనున్న దృష్ట్యా అందుకు అనుగుణంగా అదనపు భారం పడుతుంది.

’బ్రాండెడ్‌ దుస్తులు’ కొనొచ్చు
సిటీ యువత ఫాలో ఆయ్యే బ్రాండెడ్‌ దుస్తులపై రేటు కాస్త తగ్గే అవకాశం ఉంది. జీఎస్టీలో బ్రాండెడ్‌ దుస్తులకు 5 శాతం పన్ను ఖరారు చేశారు. ప్రస్తుతం వీటిపై ఎక్సైజ్, వ్యాట్‌ కలిపి 7.5 శాతం పన్ను ఉంది. అంటే రూ.1,000 ప్యాంట్‌కు ప్రస్తుతం పన్నులు కలిపి 1,075 చెల్లిస్తుంటే.. జీఎస్టీతో రూ.1,050కే లభిస్తుంది. రూ.1,000 లోపు చీరలు, వస్త్రాలపై ఐదు శాతం, అంతకంటే ఖరీదైన దుస్తులపై 12 శాతం పన్ను ఉంటుంది.

గృహోపకరణాలపై హెచ్చుతగ్గులు
ప్రస్తుతం రూ.20 వేలుండే టీవీ పన్నులతో రూ.24,900కు లభిస్తోంది. ఇక నుంచి జీఎస్టీలో 18 శాతం పన్నుతో అదే టీవీ రూ.23,600కే వస్తుంది. బ్రాండ్‌ పేరుతో ప్యాకింగ్‌ చేసి అమ్మితే ఐదు శాతం పన్ను పడే అవకాశముంది. ప్రస్తుతం ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మెషీన్లు వంటి గృహోపకరణాలకు 24.2 నుంచి 27 శాతం వరకు పన్నులున్నాయి. జీఎస్టీలో వీటన్నింటినీ 28 శాతం పన్ను విభాగంలో చేర్చారు. అంటే ఒక శాతం ధరలు పెరిగే అవకాశముంది.

హైఎండ్‌ వాహనాల ధరలు పైకి..
జీఎస్టీతో కొన్ని రకాల వాహనాల ధరలు కొంత తగ్గనుండగా, మధ్యస్థాయి, హైఎండ్‌ వాహనాల ధరలు పెరుగుతాయి. 300 సీసీ కంటే తక్కువ ఇంజిన్‌ సామర్థ్యం ఉన్న బైకులపై జీఎస్టీ  సానుకూల ప్రభావం చూపనుంది. ఈ తరహా వాహనాలపై రూ.2500 వరకు ధర తగ్గవచ్చని ఆటోమొబైల్‌  వర్గాలు అంచనా వేస్తున్నాయి. పల్సర్‌ ధర ప్రస్తుతం రూ.87 వేలు ఉండగా జీఎస్‌టీతో రూ.85 వేలకు తగ్గుతుంది. ప్రస్తుతం రూ.68 వేలు ఉన్న హోండా యాక్టివా రూ. 65,500కు చేరే అవకాశం ఉంది. ఇక హై ఎండ్‌ జాబితాలోకి వచ్చే కవాసకి, కేటీఎం డ్యూక్, హర్లీ డేవిడ్‌సన్‌ వంటివాటి ధరలు రూ.5 వేల నుంచి వాటి స్థాయిని బట్టి రూ.లక్ష వరకు పెరగవచ్చు. జీఎస్టీతో  హై ఎండ్‌ వాహనాలపై 28 శాతం కామన్‌ ట్యాక్స్‌తో పాటు మరో 15 శాతం సర్వీస్‌ ట్యాక్స్‌ కలుస్తుంది. ప్రీమియం కార్ల ధరలు తగ్గనుండగా, హై ఎండ్‌ వాహనాల ధరలు మాత్రం కొంత మేర పెరుగుతాయి. స్విఫ్ట్‌ డిజైర్, ఇన్నోవా, హోండాసిటీ వంటి కార్ల ధరలు పెరుగనున్నాయి.

మొబైల్స్‌ కాస్ట్లీ గురూ..
కేంద్రం తీసుకొస్తున్న జీఎస్టీతో మొబైల్‌ ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దిగుమతి చేసుకున్నా, స్థానిక తయారీ ఫోన్లైనా 18 శాతం పన్నులోకి తీసుకొచ్చారు. దీంతో సెల్‌ రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రూ.10 వేల ఫోన్‌కు పన్నులతో రూ.11,280 చెల్లిస్తుంటే.. జీఎస్టీతో అదే ఫోన్‌ రూ.11,800 అవుతుంది.

చౌకగా ‘చెప్పులు’..
చెప్పుల ధరలు తగ్గి సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం రూ.500 లోపు ధరలుండే చెప్పులపై 9.5 శాతం వరకు పన్నులున్నాయి. దీన్ని జీఎస్టీలో ఐదు శాతానికి తగ్గించారు. అయితే రూ.500 కన్నా ఎక్కువ ధర ఉండే చెప్పులపై ప్రస్తుతం 23.1 నుంచి 29.58 శాతం వరకు పన్నులు ఉన్నాయి. వీటికి 18 శాతం జీఎస్టీ విధించారు. బూట్లు కూడా ఇంచుమించు అవే ధరలకు లభించవచ్చు.  

అమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో వాయింపు
జీఎస్టీ అమలుతో అమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో టికెట్‌ ధరలు కూడా పెరగనున్నాయి. ప్రస్తుతం పార్కుల్లో సేవా పన్ను 15 శాతం ఉండగా, కొత్త పన్ను ప్రకారం 28 శాతం వసూలు చేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement