రామమందిరానికి ముస్లిం సంఘాల మద్దతు!
లక్నో: అయోధ్యలో రామమందిరం నిర్మాణంకు అనుకూలంగా లక్నోలో వెలసిన బ్యానర్లు చర్చనీయాంశంగా మారాయి. రామమందిరం కట్టాలని కోరుతూ కొన్ని కొన్ని ముస్లిం సంఘాలు పెద్ద పెద్ద హోర్డింగులు, బ్యానర్లు పెట్టాయి. అయోధ్య వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ బ్యానర్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఆజంఖాన్ నేతృత్వంలోని శ్రీరామ్ మందిర్ నిర్మాణ్ ముస్లిం కరసేవక్ మంచ్ అనే సంస్థ ఈ బ్యానర్లు పెట్టింది. రామమందిరానికి అనుకూలంగా బ్యానర్లు పెట్టినందుకు తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆజంఖాన్ తెలిపారు. ఈ-మెయిల్స్, ఫోన్ల ద్వారా బెదిరింపులు వచ్చాయని వెల్లడించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. తనకు భద్రత కల్పించాలని పోలీసులను కోరారు.
కాగా, రామమందిరం నిర్మాణంపై ఇప్పటివరకు బీజేపీ ఎటువంటి కార్యాచరణ ప్రకటించకపోవడం గమనార్హం. తాము అధికారంలోకి వస్తే రామమందిరం కడతామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల్లో హామీయిచ్చారు. ఈ అంశాన్ని బీజేపీ మేనిఫెస్టోలో కూడా పెట్టింది.