సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ప్రధాన పార్టీల కూటములు విచ్ఛిన్నం కావడంతో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు చక్రం తిప్పనున్నారు. ఒంటి పోరు వల్ల ఏ పార్టీకీస్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటులో వీరి పాత్ర కీలకం కానుంది. గత ఎన్నికల్లో శివసేన, బీజేపీలు మహాకూటమిగా, కాంగ్రెస్, ఎన్సీపీలు ప్రజాస్వామ్య కూటమిగా పోటీ చేశాయి. ఈసారి సీట్ల పంపకాల్లో విభేదాలతో ఈ కూటముల పొత్తు విచ్ఛిన్నమైంది. ఆ పార్టీలన్నీ వేర్వేరుగా బరిలోకి దిగాయి. ఒంటరి పోరుతో వీటి అభ్యర్థులకు ఎన్నికలు సవాలుగా మారాయి. స్వతంత్ర అభ్యర్థులు ఈ పార్టీల విజయావకాశాలను దెబ్బతీయొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఈసారి ఎన్నికల్లో మొత్తం 1,686 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. శివసేన, బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, ఎమ్మెన్నెస్ తదితర పార్టీల మధ్య పోటీ జరగనుంది. ఇవి సొంత బలంతో పోటీ చేస్తుండడంతో ఓట్లు చీలి ఇండిపెండెంట్లకు లబ్ధి చేకూరే అవకాశముంది. అత్యధిక స్థానాలు గెల్చుకునే ఏ పార్టీకి అయినాసరే ప్రభుత్వ ఏర్పాటుకు స్వతంత్రుల సాయం తప్పనిసారి కావచ్చు.
గతంలో..: 1995 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో 3,196 ఇండిపెండెంట్లు పోటీ చేయగా వారిలో 45 మంది గెలిచారు. 2009లో బరిలోకి దిగిన 1,820 స్వతంత్రుల్లో 24 మంది, 1999లో 837 ఇండింపెండెంట్లకు గాకు కేవలం 12 మంది గెలుపొందారు. 2004లో 1,083 మందికిగాను 20 గెలిచారు.