సార్క్ వీసా నిబంధనల సరళీకరణ!
న్యూఢిల్లీ: సార్క్ కూటమి దేశాల్లో వ్యాపారవేత్తల వీసా నిబంధనల సరళీకరణకు భారత్ తెరతీసింది. సార్క్ దేశాల్లో వాణిజ్యం, పెట్టుబడుల పెంపు కోసం ఈ ప్రయత్నం చేస్తున్నామని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ చెప్పారు. ఇక్కడ జరిగిన సార్క్ (దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య)బిజినెస్ లీడర్స్ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. సార్క్ దేశాల్లో వృత్తిగత నిపుణులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు విశ్వాసపూరితమైన వాతావరణం నెలకొనేలా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలకు తోడ్పడేందుకు ప్రతీ సార్క్ దేశం మిగిలిన అన్ని సార్క్ దేశాల్లో బ్యాంక్ బ్రాంచీలను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని వివరించారు. ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక దేశాల వాణిజ్య, ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. పేదరికం, నిరుద్యోగం, పౌష్టికాహార లోపం వంటి సమస్యలపై కలసికట్టుగా పోరాడాల్సిన అవసరముందని ఈ మంత్రులు అభిప్రాయపడ్డారు.
భారత్, పాక్‌ల్లో బ్యాంక్ బ్రాంచీలు
పాకిస్తాన్‌లో కార్యకలాపాలు నిర్వహించడానికి ఎస్‌బీఐ, బీఓఐలకు అనుమతి లభించగా, భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించడానికి నేషనల్ బ్యాంక్ ఆఫ్ పాకి స్థాన్, యునెటైడ్ బ్యాంక్‌లకు అనుమతి లభించింది.