ప్రత్యేక డిమాండ్లు అంగీకరిస్తే దేశంలో ఉండే రాష్ట్రాలు 50 | India May Have 50 States If All Demands For New States Are Met | Sakshi
Sakshi News home page

ప్రత్యేక డిమాండ్లు అంగీకరిస్తే దేశంలో ఉండే రాష్ట్రాలు 50

Published Mon, Aug 5 2013 2:26 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM

ప్రస్తుతమున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లకు కేంద్రం ఓకే చెబితే.. భవిష్యత్తులో మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయో తెలుసా? కనీసం 50. ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటూ 20కి పైగా ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర హోంశాఖకు అందాయని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లకు కేంద్రం ఓకే చెబితే.. భవిష్యత్తులో మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయో తెలుసా? కనీసం 50. ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటూ 20కి పైగా ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర హోంశాఖకు అందాయని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఇందులో మణిపూర్‌లో కుకీలాండ్, తమిళనాడులో కొంగునాడు, బెంగాల్లో కామ్తాపుర్, కర్ణాటకలో తుళునాడు, గుజరాత్‌లో సౌరాష్ట్ర వంటివి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో గుర్ఖాలాండ్, బోడోలాండ్, కర్బీ ఆంగ్లాంగ్, విదర్భ వంటి ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లు ఊపందుకున్నాయి. ఇంకా భోజ్‌పూర్, కోసల, కూర్గ్, కొంకణ్, గారోలాండ్, మిథిలాంచల్, దిమాలాండ్ ప్రతిపాదనలూ ఉన్నాయి. అయితే యూపీ ప్రభుత్వం తప్ప మరే రాష్ట్ర ప్రభుత్వమూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలివ్వలేదు. మిగిలిన ‘ప్రత్యేక’ ప్రతిపాదనలన్నీ వివిధ సంస్థలు లేదా వ్యక్తుల నుంచి వచ్చినవే. ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలున్నాయి. 29వ రాష్ట్రంగా తెలంగాణ  ఏర్పాటుకు యూపీఏ, కాంగ్రెస్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే.
 
  ఎక్కడెక్కడ ప్రత్యేక డిమాండ్లు..?
 యూపీలో నాలుగు రాష్ట్రాలు: యూపీని పూర్వాంచల్, బుందేల్‌ఖండ్, అవధ్‌ప్రదేశ్, పశ్చిమాంచల్ లేదా హరితప్రదేశ్‌గా విభజించాలనే డిమాండ్ ఉంది. మాయావతి సీఎంగా ఉన్నప్పుడు ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదన పంపారు.
 
 గూర్ఖాలాండ్: పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ పరిసర ప్రాంతాలను కలిపి గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటుచేయాలన్న డిమాండ్ ప్రస్తుతం ఊపందుకుంది.
 
 బోడోలాండ్, కర్బీ ఆంగ్లాంగ్: పశ్చిమ అస్సాంలో బోడో ప్రాబల్య ప్రాంతాలను కలిపి బోడోలాండ్‌గా ఏర్పాటు చేయాలని తీవ్రస్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. అలాగే అస్సాంలోని స్వతంత్ర ప్రతిపత్తి గల కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా పరిధిలో కర్బీ గిరిజన ప్రజలు నివసించే ప్రాంతాలను కలిపి కర్బీ ఆంగ్లాంగ్ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కూడా ఊపందుకుంది.
 
 బ్రజ్ ప్రదేశ్: యూపీలోని ఆగ్రా, అలీగఢ్ డివిజన్లను, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లోని భరత్‌పూర్, గ్వాలియర్ జిల్లాలను కలిపి బ్రజ్ ప్రదేశ్‌ను ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
 విదర్భ: మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్ కూడా ఎప్పటినుంచో ఉంది.
 
 భోజ్‌పూర్: యూపీలోని తూర్పు ప్రాంతాలు, బీహార్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి భోజ్‌పూర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనా ఉంది.
 
 మిథిలాంచల్: బీహార్, జార్ఖండ్‌లలో మైథిలీ భాష మాట్లాడే ప్రాంతాలను మిథిలాంచల్‌గా ఏర్పాటుచేయాలని అక్కడివారు కోరుతున్నారు.
 
 దిమాలాండ్: అస్సాం, నాగాలాండ్‌లలో దిమాసా ప్రజలు నివసించే ప్రాంతాలను వేరుచేసి దిమాలాండ్ లేదా దిమారాజి రాష్ట్రంగా  ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
 
 కామ్తాపూర్: పశ్చిమ బెంగాల్‌లో కూచ్ బేహార్, జల్పాయ్‌గురిలతోపాటు కొన్ని జిల్లాలను కలిపి కామ్తాపూర్ రాష్ట్రం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
 
 కోసల్: ఒడిశాలోని కొన్ని జిల్లాలు, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని ప్రాంతాలను కలిపి కోసల్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని పలువురు కోరుతున్నారు.
 
 కుకీలాండ్: మణిపూర్‌లోని కుకీ గిరిజనులు నివసించే ప్రాంతాలను ప్రత్యేక కుకీలాండ్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
 
 గారోలాండ్: మేఘాలయలోని గారో ప్రాంతాలను కలిపి గారోలాండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
 
 సౌరాష్ట్ర: గుజరాత్ నుంచి సౌరాష్ట్రను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటుచేయాలని కూడా కోరుతున్నారు.
 కొంగునాడు: కర్ణాటకలోని ఆగ్నేయ ప్రాంతం, తమిళనాడులోని నైరుతి ప్రాంతం, కేరళలోని తూర్పు ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక కొంగునాడు రాష్ట్రం ఏర్పాటుకు డిమాండ్ వినిపిస్తోంది.
 
 కూర్గ్: కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతాన్ని రాష్ట్రంగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్ ఉంది.
 తుళునాడు: కర్ణాటక, కేరళ రాష్ట్రాల మధ్య సరిహద్దు ప్రాంతాన్ని తుళు నాడుగా వేరు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
 
 కొంకణ్: పశ్చిమ భారత్‌లో అరేబియా సముద్రం తీరప్రాంతం వెంబడి కొంకణి భాష మాట్లాడే ప్రాంతాలను కలుపుతూ ప్రత్యేక కొంకణ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  
 
 లడఖ్: జమ్మూ కాశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా కేంద్ర హోం శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. తూర్పు నాగాలాండ్: పై ప్రత్యేక డిమాండ్లే కాకుండా.. నాగాలాండ్‌ను కొన్ని ప్రాంతాలను వేరుచేసి తూర్పు నాగాలాండ్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement