భారత్‌కు స్వభ్యత్వం.. అమెరికాపై చైనా ఫైర్!
అంతర్జాతీయ అణుసరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌కు సభ్యత్వం విషయంలో అమెరికాపై చైనా ఘాటుగా విరుచుకుపడింది. ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం అనేది దిగిపోయే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు ఇచ్చే వీడ్కోలు కానుక కాదని నోరుపారేసుకుంది. అణు సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మార్గం సుగమం చేసే ఎన్‌ఎస్‌జీలో భారత్ సభ్యత్వానికి మోకాలడ్డుతోంది చైనాయేనని అమెరికా విదేశాంగశాఖ అసిస్టెంట్ సెక్రటరీ నిషా దేశాయ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో డ్రాగన్ దేశం ఈవిధంగా స్పందించింది.
ఎన్‌ఎస్‌జీలో భారత్‌కు సభ్యత్వం ఇచ్చే విషయంలో ఇప్పట్లో తన వైఖరి మార్చుకునే ప్రసక్తి లేదని సంకేతాలు ఇచ్చింది. 'ఎన్‌ఎస్‌జీలో భారత్ సభ్యత్వం, ఎన్పీటీ రహిత దేశాల సభ్యత్వం విషయంలో మా వైఖరి ఇదివరకే స్పష్టం చేశాం. దానిని నేను పునరుద్ఘాటించబోను. కానీ, ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం అనేది ఒక దేశం మరొక దేశానికి ఇచ్చే వీడ్కోలు కానుక కాదని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను' అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
48 దేశాల ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం విషయంలో ఎన్పీటీ (అణునిరాయుధీకర ఒప్పందం)ని బూచిగా చూపెట్టి భారత్‌కు చైనా మోకాలడ్డుతోంది. ఈ ఒప్పందంపై సంతకం చేయని దేశాలను ఎన్‌ఎస్‌జీలో తీసుకోవాలంటే.. అందుకు గ్రూప్ విధివిధానాలను సవరించాలని, అందరి ఏకాభిప్రాయం తీసుకోవాలని చైనా మొండిగా వాదిస్తోంది. తన అనుయాయి పాకిస్థాన్ కోసమే చైనా ఇంత రాద్ధాంతం చేస్తున్నదని నిపుణులు భావిస్తున్నారు.