ఇండియా విషయంలో మేం మారం: చైనా
బీజింగ్:చైనా మరోసారి తన మొండిపట్టును వీడనంది. భారత్ విషయంలో తమ వైఖరి మారబోదని ఆ దేశం స్పష్టం చేసింది.న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్‌ఎస్‌జీ)లో భారత్ ప్రవేశం విషయంలో తమ నిర్ణయాన్ని మార్చుకోబోమంటూ మరోసారి తన వ్యతిరేక వైఖరిని తేటతెల్లం చేసింది. ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వం ఉన్న 48 దేశాల్లో దాదాపు అన్ని దేశాలు భారత్ ప్రవేశానికి ఎలాంటి అడ్డు చెప్పనప్పటికీ చైనా మాత్రం అడ్డుకుంటోంది. వచ్చే నెలలో కూడా దీనికి సంబంధించిన సమావేశం జరగనున్న నేపథ్యంలో మరోసారి చైనా చేసిన ఈ ప్రకటన భారత్ ఆశలపై నీళ్లు జల్లినట్లయింది.
ఎందుకంటే భారత్ ఎంట్రీకి చైనా మద్దతు చాలా అవసరం. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ మీడియాతో మాట్లాడుతూ భారత్ ఈసారి న్యూక్లియర్ క్లబ్బులోకి అడుగుపెడుతుందని అనుకుంటున్నారని అని అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. ఎన్‌ఎస్‌జీలో సభ్యత్వానికి భారత్‌తోపాటు పాక్ కూడా దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. భారత్‌కు ప్రవేశం కల్పిస్తే పాక్‌కు కూడా కల్పించాల్సిందేననేది చైనా వాదన. ఇటీవల చైనాలో నిర్వహించిన వన్ బెల్ట్ వన్ రోడ్డు సమావేశానికి భారత్ గైర్హాజరవడం, దానిని వ్యతిరేకించడం కూడా భారత్‌కు ఎన్‌ఎస్‌జీలో అవకాశం లేకుండా చేయాలని చైనా మరింత మొండిపట్టుతో ఉన్నట్లు తెలుస్తోంది.