'ఇండియాది 1962 నాటి మైండ్సెట్'
బీజింగ్: భారత్ పై చైనా అధికారిక పత్రికల రాతల దాడిని కొనసాగిస్తూనే ఉంది. నిన్నటికి నిన్న భారత్ ఓ చెడ్డదేశమని, భారతీయులు పద్ధతులు నేర్చుకోవాలని చెవాకులు పేలిన చైనీస్ పత్రికలు నేడు ఇండియాది 1962నాటి మైండ్ సెంట్ అంటూ విమర్శలు కురిపించింది. కమ్యూనిస్ట్ ప్రభుత్వ కనుసన్నల్లో నడిచే 'గ్లోబల్ టైమ్స్' పత్రిక సోమవారం నాటి సంపాదకీయంలో భారత్ పై మరోసారి విషం వెళ్లగక్కింది. అణు సరఫరా బృందం(ఎన్ఎస్ జీ) సభ్యత్వం విషయంలో చైనాపై అభాండాలు వేయడం సరికాదని, దానికంటే ప్రపంచం మెప్పును పొందే ప్రయత్నాలు మంచివని ఉచిత సలహా ఇచ్చింది. (చదవండి: 'ఇండియా ఓ చెడ్డ దేశం' అంటూ..)
'గత వారం సియోల్ లో జరిగిన ఎన్ఎస్జీ ప్లీనరీ సమావేశాలు భారతీయులకు కాస్త కఠినంగా అనిపించవచ్చు. వారి దృష్టిలో చైనాయే భారత్ ఎన్ ఎస్ జీ సభ్యత్వానికి అడ్డుపడిందనే భావన ఉండొచ్చు. నిజానికి బీజింగ్.. న్యూ ఢిల్లీలో ఎల్లప్పుడూ స్నేహాన్నే కొరుకుంటోంది. కేవలం అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై సంతకం చేయనందునే ఎన్ ఎస్ జీలోకి భారత్ ప్రవేశాన్ని చైనా సహా మరో 10 దేశాలు అడ్డుకున్నాయి. ప్రపంచాన్ని మెప్పించాల్సిందిపోయి భారతీయులు, భారతీయ మీడియా చైనాను దూశించేపనిలో పడింది. బీజింగ్ ఉదాత్తమైన ఆలోచనలను అర్థం చేసుకోవడంలో న్యూ ఢిల్లీ విఫలం అవుతోంది. ఇండియా ఇంకా 1962 యుద్ధ కాలం నాటి మైడ్ సెట్ లో ఉంది. దాని నుంచి బైటపడి విశాల దృక్ఫధంతో చైనా అభ్యంతరాలను అర్థం చేసుకోవాలి' అని 'గ్లోబల్ టైమ్స్' పేర్కొంది.