గీతకు ప్రతిగా పాక్‌కు 'రంజాన్' గిఫ్ట్ | India to send Ramzan home as a 'return gift' to Pakistan for Geeta | Sakshi
Sakshi News home page

గీతకు ప్రతిగా పాక్‌కు 'రంజాన్' గిఫ్ట్

Published Mon, Oct 26 2015 8:00 PM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

గీతకు ప్రతిగా పాక్‌కు 'రంజాన్' గిఫ్ట్

గీతకు ప్రతిగా పాక్‌కు 'రంజాన్' గిఫ్ట్

భోపాల్: దాదాపు 15 ఏళ్ల తర్వాత గీత కల నెరవేరింది. పొరపాటున పాకిస్థాన్‌ చేరిన ఆమె సోమవారం భారత్ చేరుకుంది. ఇందుకు ప్రతిగా భారత్ కూడా పాకిస్థాన్‌కు ఓ బహుమతి ఇవ్వనుంది. ఇంటి నుంచి పారిపోయివచ్చి భారత్‌లో ఆశ్రయం పొందుతున్న 15 ఏళ్ల బాలుడు మహమ్మద్ రంజాన్‌ను తిరిగి స్వదేశం పంపించనుంది.

కరాచీకి చెందిన మహమ్మద్ రంజాన్ పదేళ్ల వయస్సులోనే తల్లి నుంచి వేరయ్యాడు. రంజాన్ తండ్రి బాలుడిని తీసుకొని బంగ్లాదేశ్ వెళ్లి అక్కడ మరో పెళ్లి చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌లో సవతి తల్లి వేధింపులు అధికమవ్వడంతో 2011లో అతను ఇంటి నుంచి పారిపోయాడు. మళ్లీ కరాచీలోని తన తల్లిని కలుసుకునేందుకు సరిహద్దులు దాటి భారత్ వచ్చాడు. భారత్‌లోని అనేక రాష్ట్రాలు తిరిగిన ఆ బాలుడు చివరకు భోపాల్‌లో తేలాడు. 2013 సెప్టెంబర్ 22న భోపాల్ రైల్వే స్టేషన్‌లో అతన్ని గుర్తించిన రైల్వే పోలీసులు.. చైల్డ్‌లైన్ అనే స్వచ్ఛంద సంస్థకు తరలించారు. అప్పటినుంచి అక్కడే ఉంటున్న రంజాన్ తన తల్లిని కలుసుకునేందుకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్నాడు.

కరాచీలోని బాలుడి తల్లిని గుర్తించేందుకు చైల్డ్‌లైన్ స్వచ్ఛంద సంస్థ ప్రయత్నించింది. కానీ అప్పుడు ఫలితం లభించలేదు. దీంతో కేంద్ర విదేశాంగ శాఖ కూడా ఈ అబ్బాయి కేసును స్వీకరించలేదు. అతడు పాకిస్థాన్ పౌరుడిని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్‌లో భోపాల్‌కు చెందిన ఒక సీఎ విద్యార్థి సోషల్ మీడియాలో రంజాన్ ఫొటోలు షేర్ చేశాడు. దీంతో కరాచీలోని రంజాన్ తల్లి రజియా బేగం ఆచూకీ తెలిసింది. భారత్‌లో తన కొడుకు ఉన్నాడన్న ఈ సమాచారం అందడంతో ఆమె పాకిస్థాన్  హక్కుల కార్యకర్త అన్సర్ బర్నే ద్వారా భారత ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి పంపింది. తమ కొడుకును తమకు అప్పగించాలని కేంద్రాన్ని కోరుతూ ఆన్‌లైన్‌లో ఒక వీడియోను అప్‌లోడ్ చేసింది. రంజాన్‌ కుటుంబసభ్యుల పాస్‌పోర్టులు కూడా  అన్సర్ బర్నే గతంలో పంపించారు. అయినా అతన్ని కరాచీ పంపించే చర్యలు అర్ధాంతరంగా ఆగిపోయాయి.

తాజాగా భారత్ రావాలన్న గీత కోరికను పాక్ నెరవేర్చిన నేపథ్యంలో భారత్‌ కూడా ఈ విషయంలో సహృదయంతో స్పందించింది. రంజాన్ తిరిగి కరాచీ పంపించే చర్యలను చేపట్టాలని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)  భోపాల్‌లోని చైల్డ్‌లైన్ సంస్థకు సోమవారం ఆదేశాలు పంపింది. ఈ మేరకు పీఎంవో అధికారులు స్వయంగా ఫోన్ చేసి తెలిపారు. 'రంజాన్ విషయంలో పీఎంవో చొరవ తీసుకోవడం  నాకెంతో ఆనందంగా ఉంది. అతన్ని సాధ్యమైనంత త్వరలో ఇంటికి పంపాలనుకుంటున్నాం' అని చైల్డ్‌లైన్ భోపాల్ చాప్టర్ డైరెక్టర్ అర్చన సహాయ్ తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement