భారత్‌కు విమాన సర్వీసులు ఆపేసింది..
కరాచీ: భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో కరాచీ నుంచి ముంబై, ఢిల్లీకి విమాన సర్వీసులను పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) రద్దు చేసింది. ప్రయాణికుల సంఖ్య తగ్గడమే దీనికి కారణమని పేర్కొంది. ఉడీ ఉగ్రదాడుల ప్రభావం విమాన సర్వీసులపైనా పడింది.
దీనిపై పీఐఏ శనివారం ఓ ప్రకటన చేసింది. లాహోర్-ఢిల్లీ మధ్య విమాన సర్వీసులు యాథాతథంగా కొనసాగుతున్నాయని పీఐఏ అధికారి తెలిపారు. గత మూడు, నాలుగు వారాలుగా కరాచీ నుంచి ముంబై, ఢిల్లీకి వెళ్లేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని, దీంతో ఆ మార్గాల్లో నడిచే విమానాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
అయితే ఇప్పటికే రద్దు చేసిన మార్గాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు వేరే రూట్లలో నడిచే విమానాల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. అలాగే భారత్ నుంచి కరాచీ వచ్చే ప్రయాణికులు ఢిల్లీ, ముంబైలోని పీఐఎ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది.
కాగా భారత్ నుంచి పాకిస్తాన్ను నేరుగా వెళ్లేందుకు విమాన సర్వీసులు లేవు. పాక్ ఇంటర్నరేషనల్ ఎయిర్లైన్స్ ద్వారానే ఇరు దేశాల మధ్య రాకపోకలు కొనసాగేవి. ఢిల్లీ-కరాచీ, ఢిల్లీ-లాహోర్, ముంబై-కరాచీల మధ్య అయిదు విమానాలు నడిచేవి. పీఐఏ నిర్ణయంతో శనివారం నుంచి విమాన సర్వీసులు నిలిచిపోయాయి.