హెచ్-1బీ వీసా వాడకం ఆపేయండి
హెచ్-1బీ వీసా వాడకం ఆపేయండి
Published Fri, Feb 3 2017 8:50 AM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM
న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసా చట్ట సవరణ రూపంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురుకాబోతున్న ముప్పుకు భారత ఐటీ దిగ్గజాలన్నీ గజగజలాడుతున్న సంగతి తెలిసిందే. హెచ్-1బీ వీసా భయంతో దేశీయ మార్కెట్లో కంపెనీలు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి దేశీయ ఐటీ కంపెనీలకు పలు సూచనలు చేశారు. దేశీయ కంపెనీలు మరింత బహుళ సాంస్కృతికి అలవాటు పడాల్సిన అవసరం ఉందని, హెచ్-1బీ వీసాల వాడకం ఆపేయాలని సూచించారు. సర్వీసులను అందించడానికి ఇక్కడి నుంచి భారీగా భారతీయులను విదేశాలకు తరలించడం కూడా ఆపేయాలన్నారు. స్థానిక ఉద్యోగుల నియామకంపై దృష్టిసారిస్తే ఇలాంటి ముప్పుల నుంచి బయటపడొచ్చన్నారు. విదేశీ వర్కర్లపై కఠిన ఆదేశాలు విధించేందుకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న ప్రతిపాదనలు నేపథ్యంలో ఓ ఇంగ్లీష్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నారాయణమూర్తి కంపెనీలకు ఈ సూచనలు చేశారు.
''అమెరికాలో అమెరికా నివాసితులనే తీసుకోవాలి, కెనడాలో కెనడియన్లను, బ్రిటిష్లో బ్రిటైన్ వారిని నియమించుకోవాలి. అలా చేస్తేనే మనం నిజమైన బహుళ జాతీయ కంపెనీలగా పేరులోకి వస్తాం. హెచ్-1బీ వీసాల వాడకం తగ్గించేయండి. భారీగా భారతీయులను ఇక్కడి నుంచి అక్కడికి పంపించడం కూడా ఆపండి'' అని నారాయణ మూర్తి పేర్కొన్నారు. ట్రంప్ ఆదేశాలు అమల్లోకి వస్తే, మన కంపెనీలు మరింత బహుళ సాంస్కృతిక కంపెనీలుగా పేరులోకి రావడానికి ఎంతో సహకరించనున్నాయని చెప్పారు. బహుళ-సాంస్కృతిలా మారడం అంతా సులభం కాదు.. మన కంపెనీల ఆలోచనలు అందుకే ఎప్పుడూ సాఫ్ట్గా ఉంటాయని పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే ఈ నిర్ణయానికి కంపెనీలు ఎందుకు అంతలా భయపడుతున్నాయనే ప్రశ్నకు నారాయణమూర్తి ఈ మేరకు సమాధానమిచ్చారు.
Advertisement