బెయిల్పై వచ్చి.. భార్యను చంపేశాడు!!
బెయిల్ మీద బయటకు వచ్చి, గతంలోనే తన నుంచి విడిపోయిన భార్యను చంపినందుకు న్యూజిలాండ్లో ఓ భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు పడింది. రాజేశ్వర్ సింగ్ (47) అనే ఈ వ్యక్తి కనీసం 16 ఏళ్ల పాటు పెరోల్ కూడా లేకుండా తప్పనిసరిగా జీవిత ఖైదు అనుభవించాలని వెల్లింగ్టన్ హైకోర్టు తీర్పునిచ్చింది. టాక్సీ డ్రైవర్ అయిన రాజేశ్వర్ సింగ్ మాత్రం తాను తన మాజీ భార్య స్వర్ణలతను చంపలేదని వాదించాడు. కానీ, అతడు వస్తాడేమోనన్న భయంతో ఆమె గుమ్మానికి అడ్డంగా పెట్టిన కుర్చీలు, మంచాలన్నింటినీ తోసేసి, కొత్త తాళాన్ని పగలగొట్టి మరీ పొడిచి చంపినట్లు ప్రాసిక్యూషన్ వాదించింది.
గతంలో రక్షణ ఉత్తర్వులను ఉల్లంఘించిన నేరానికి జైల్లో ఉన్న అతడు, నెల రోజుల క్రితమే బెయిల్ మీద విడుదలయ్యాడు. ఆమెను చూడకూడదని, ఆ ఇంటి సమీపంలోకి కూడా వెళ్లకూడదని అతడిని గతంలో కోర్టు నిరోధించింది. కానీ, ఆమెను చంపడానికి కొన్ని వారాల ముందునుంచి అతడు ఆ ఇంటి చుట్టుపక్కలే తిరిగాడు. ఆమెను చంపాలన్న ఉద్దేశంతోనే రాజేశ్వర్ సింగ్ అలా వెళ్లాడని, ఆమె పట్ల, ఆమె కుటుంబం పట్ల తీరని ద్వేషం ఉందని జస్టిస్ యంగ్ వ్యాఖ్యానించారు. వీరిద్దరికీ 1991లో ఫిజీలో పెళ్లయింది. 1998లో న్యూజిలాండ్ వెళ్లారు. వారికి ఒక కొడుకు పుట్టి, కండరాల క్షీణత వ్యాధి (మస్క్యులర్ డిస్ట్రొఫీ)తో 2011లో చనిపోయాడు. భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు.