విదేశీ ఫండ్స్‌పై భారతీయుల క్రేజ్ | Indians Crazy on investing in foreign funds | Sakshi
Sakshi News home page

విదేశీ ఫండ్స్‌పై భారతీయుల క్రేజ్

Published Wed, Nov 6 2013 1:50 AM | Last Updated on Thu, Oct 4 2018 8:05 PM

విదేశీ ఫండ్స్‌పై భారతీయుల క్రేజ్ - Sakshi

విదేశీ ఫండ్స్‌పై భారతీయుల క్రేజ్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇప్పుడు దేశీయ ఇన్వెస్టర్లు డాలర్లు, యూరోల్లో ఇన్వెస్ట్ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. విదేశీ ఫండ్స్ ముఖ్యంగా అమెరికా, యూరో దేశాల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ అధిక లాభాలను అందిస్తుండటంతో వీటిపై ఆసక్తిని కనపరుస్తున్నారు. ఒకపక్క దేశీయ మ్యూచువల్ ఫండ్ పథకాల నుంచి ఇన్వెస్టర్లు వైదొలుగుతుంటే, విదేశీ ఫండ్స్‌లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. గడిచిన ఏడాది కాలంలో అమెరికా, యూరప్ దేశాల ఫండ్స్ 40 నుంచి 50 శాతం దాకా రాబడులను అందించాయి. కాని ఇదే సమయంలో మన సెన్సెక్స్ కేవలం 13 శాతం, నిఫ్టీ 11 శాతం రాబడులను మాత్రమే అందించాయి. దేశీయ ఫండ్స్ కంటే అమెరికా, యూరప్ ఫండ్స్ అధిక లాభాలను అందించడానికి రూపాయి క్షీణత కూడా దోహదం చేసిందంటున్నారు నిపుణులు. గడిచిన ఏడాది కాలంలో అమెరికా మార్కెట్లు 26 శాతం రాబడిని అందిస్తే ఇదే సమయంలో రూపాయి విలువ 18 నుంచి 20 శాతం క్షీణించింది.
 
 కొత్త పథకాల వెల్లువ: ఇండియాతో పోలిస్తే గత రెండేళ్ళుగా అమెరికా వృద్ధి రేటు బాగుండటం, అక్కడి మార్కెట్లు పెరుగుతుండటంతో దేశీయ ఇన్వెస్టర్లు ఈ విదేశీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని ఐడీబీఐ మ్యూచువల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బి.శరత్ శర్మ చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో ఇండియాలో నిర్వహిస్తున్న అమెరికా ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.251 కోట్ల నుంచి రూ.658 కోట్లకు చేరిందంటే, వీటిపై ఏ విధంగా ఆసక్తి చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు విదేశీ ఫండ్స్‌ను ప్రారంభించడానికి అనుమతి కోరుతూ సెబీ తలుపులు తడుతున్నాయి. కోటక్, రెలిగేర్, పైన్ బ్రిడ్జ్ ఇండియాలు అమెరికా ఫండ్స్‌ను ప్రారంభించడానికి సెబీకి దరఖాస్తు చేసుకోగా, జేపీ మోర్గాన్, రెలిగేర్ సంస్థలు యూరోప్ ఫండ్, రిలయన్స్ జపాన్ ఫండ్స్‌ను ప్రారంభించడానికి రెడ్ హెర్రింగ్ ప్రోస్పెక్టస్‌ను దాఖలు చేసుకున్నాయి. ఇవికాకుండా ఎస్‌బీఐ వంటి మరికొన్ని సంస్థలు ఇదే ఆలోచనలో ఉన్నాయి. తాము కూడా గ్లోబల్ ఫండ్స్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నామని, ఇందుకోసం అమెరికాలో ఒక భాగస్వామిని వెతికే పనిలో ఉన్నామని, ఇదంతా ఇంకా ప్రారంభ దశలోనే ఉందని శర్మ పేర్కొన్నారు.
 
 రూపీ రిస్క్ ఉంటుంది
 అమెరికా మార్కెట్ లాభాలకు తోడు, దేశీయ కరెన్సీ పతనంతో దేశీయ ఇన్వెస్టర్లు రెండిందాల లాభపడ్డారని, కాని ప్రతీసారి అదే విధమైన పరిస్థితులు ఉండకపోవచ్చని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కూడా రూపాయి ఇదే విధంగా పతనమవుతుందని ఆశించడం ఆత్యాశ అవుతుందన్నది వారి అభిప్రాయం. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్ల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లే ఎక్కువ లాభాలను అందిస్తాయని జెన్‌మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటి పేర్కొన్నారు. ఒక్కసారి మన ఆర్థిక వ్యవస్థ కుదుటపడి, కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే రూపాయి విలువ పెరుగుతుందని, ఆ మేరకు ఈ ఫండ్స్ లాభాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాది కాలానికి ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయోచ్చని, అది కూడా మొత్తం పోర్ట్‌ఫోలియోలో 10 శాతం మించకుండా చూసుకోమని సతీష్ సూచిస్తున్నారు.


 టాప్5 విదేశీ ఫండ్స్    
 పథకం పేరు-            ఎన్‌ఏవీ(రూ.లలో)-    ఏడాది రాబడి%
 ఎఫ్‌టీ ఇండియా యూఎస్ ఆపర్చునుటీస్-    16.57    -    52
 మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 -    207.36    -    46
 ఐసీఐసీఐ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ    -15.13    -    45
 డీఎస్‌పీబీఆర్ యూఎస్ ఫ్లెక్సిబుల్    -14.06    -    39
 డీడబ్ల్యూఎస్ గ్లోబల్ థీమటిక్ ఆఫ్‌షోర్-    12.74    -    37

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement