అక్కడకు వెళ్లడం సాధ్యమేనా...
అంగారకుడు... అదొక గ్రహం...
అక్కడ మానవాళి మనుగడ సాధ్యమే...
అక్కడ నీళ్లు ఉన్నాయి... అక్కడ మట్టి ఉంది...
అక్కడ వాతావరణం ఉంది... అక్కడ గాలి ఉంది...
ఇన్ని ఉన్నచోటికి మనుషులు వెడితే ఎంత బాగుంటుంది!
ఇది సాధ్యమేనా..? అక్కడకు వెళ్లగలమా..?
మేం తీసుకువెడతాం అంటున్నారు డచ్ సంస్థవారు.
అంగారకుడు... ఎర్రటి గ్రహం... ఊహించుకుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఒక దేశం నుంచి మరొక దేశం వెళితేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అటువంటిది ఒక గ్రహం నుంచి మరొక గ్రహం మీదకు వెళ్లడమంటే మరింత అద్భుతంగా ఉంటుంది. అక్కడకు తీసుకువెళ్లడానికి కొంతమందిని ఎంపిక చేసింది డచ్ కంపెనీ. ఎంపికైనవారి మనోభావాలు...
అటూఇటూ తిరగాలి...
‘‘నాకు ఏలియన్స్‌ని కలవాలని ఉంది. ఈ విశ్వంలో మనం మాత్రమే కాకుండా ఇంకా వేరేవారు ఉండి ఉంటారని నా ప్రగాఢ విశ్వాసం. వీలైతే నాకు భూమి మీద, అంగారకుడి మీద కూడా అటూఇటూ తిరుగుతూ నివసించాలని ఉంది’’ అంటారు ఢిల్లీలోని గుర్గావ్‌లో నివసిస్తున్న ఇంజనీరింగ్ చదువుతున్న 21 ఏళ్ల అమూల్య నిధి రస్తోంగీ.
2024లో డచ్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంగారకుడి మీదకు తీసుకువెళ్లడానికి ఆసక్తి ఉన్నవారి కోసం పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం రెండు మిలియన్ల అప్లికేషన్లు వచ్చాయి. అందులో నుంచి 1058 మందిని ఎంపిక చేశారు. అంగారకుడి మీద నివాస స్థానాలు ఏర్పాటుచేయాలని ఈ సంస్థ ఆశిస్తోంది. ఈ సెలక్ట్ అయిన వారి నుంచి వివిధ అంశాల మీద పోటీ నిర్వహించి చివరగా ఇరవైనాలుగు మందిని ఎంచుకుని, వారిని అంగారకుడి మీదకు పంపుతారు.
ఈ భారీ ప్రాజెక్టుకి, భారతదేశం నుంచి అత్యధికంగా అప్లికేషన్లు వచ్చాయి. అందులోనుంచి ఆరవెరైండు మందిని ఎంపిక చేశారు. ఇక్కడకు వెళ్లేవారికి ముందుగా ఏడు సంవత్సరాల ప్రత్యేక శిక్షణ ఉంటుంది. ఈ ప్రాజెక్టు 2015 లో ప్రారంభం అవుతుంది. ఈ శిక్షణ వల్ల వారు శారీరకంగా, సాంఘికంగా తక్కువ మందితో ఉండటం అలవాటవుతుంది. భారతదేశం నుంచి ఎంపికైనవారిలో విద్యార్థులు, వ్యాపారవేత్తలు, స్టాక్ బ్రోకర్ల నుంచి వైట్‌కాలర్ ప్రొఫెషనల్స్ వరకు ఉన్నారు.
వివాహం చేసుకునే ఉద్దేశ్యం లేదు...
కలకత్తాకు చెందిన 24 ఏళ్ల ‘ఎనర్జీ ప్రొఫెషనల్’ ఆరిందమ్ సాహా, ఈ ప్రయాణం కోసం వివాహం చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. ‘‘అంగారకుడి మీదకు వెడదామనుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకురారు. అందువల్ల నేను వివాహం గురించి ఆలోచన చేయట్లేదు. నాకు అమ్మాయిలతో స్నేహం కూడా లేదు. అంతేకాదు అసలు పెళ్లి మీదే వ్యామోహం లేదు’’ అన్నారు సాహా.
ముంబైకి చెందిన 45 ఏళ్ల స్టాక్ బ్రోకర్ ఆశిశ్ మెహతా, ‘అంగారకుడి మీదకు వెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాను’’ అంటారు.
ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను...
‘‘ఇరవయ్యో యేట నా వివాహం జరిగింది. ఇప్పుడు మా అబ్బాయికి 19, అమ్మాయికి 17. నేను ఇప్పటికి సుమారు 60 మిలియన్ల రూపాయలు దాచాను. మా కుటుంబానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశానని భావిస్తున్నాను. పది సంవత్సరాల తర్వాత అంగారకుడి మీదకు బయలుదేరేటప్పటికి మా అబ్బాయికి 29, అమ్మాయికి 27 వస్తాయి. అప్పటికి వారి చదువులు, పెళ్లిళ్లు కూడా పూర్తవుతాయి. బహుశ మనవల్ని, మనవరాళ్లని కూడా చూస్తానేమో!’’ అన్నారు.
ఇంకా... ‘‘వచ్చిన అప్లికేషన్లలో మమ్మల్ని ఎంచుకుని, మాకు శిక్షణ ఇప్పించినప్పటికీ, అంగారక గ్రహం మీదకు వెళ్లాక ఎలా మనగలుగుతామోననే భయం మాత్రం ఉంది. అక్కడి వాతావరణం బరువుగా కాకుండా తేలికగా, బాగా చల్లగా ఉంటుంది. నీరు గడ్డకట్టి ఉంటుంది. అది కూడా భూగర్భంలో మాత్రమే లభిస్తుంది. రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. అక్కడకు వెళ్లడానికి నిధులు, సాంకేతికత ఎంతవరకు పనిచేస్తాయో చూడాలి’’ అని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
ఇది సాధ్యం కాదు...
భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న ప్రొఫెసర్ జెరార్డ్ హూఫ్ట్, ఈ ప్రాజెక్టు గురించి విని ఆశ్చర్యపోయారు. ఎంపిక చేయబడినవారిని అంగారకుడి మీదకు పంపడానికి నిధులు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ‘‘వీరి ప్రయాణానికి తగిన నిధులు ఎక్కడినుంచి వస్తాయో నాకు అర్థం కావడంలేదు. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రణాళిక’’ అన్నారు ఆయన. అయితే అంగారక గ్ర హం కో ఫౌండర్ అయిన బాస్ లాన్స్‌డ్రాప్ మాత్రం, అంగారకుడి మీదికి పది సంవత్సరాల మానవులను విజయవంతంగా పంపగలనని ఆశాభావం వ్యక్తం చేశారు.
చాలా ఖర్చవుతుంది...
ఈ మిషన్‌కు తమకు ఆరు బిలియన్ పౌండ్ల ధనం అవసరమవుతుందని, ఆ ధనాన్ని పెద్దపెద్ద పారిశ్రామికవేత్తల నుంచి సేకరిస్తామని, అదేవిధంగా ఈ ఈవెంట్‌ని ప్రసారం చేసేవారి దగ్గర నుంచి కూడా కొంత సేకరిస్తామని చెప్పారు. ‘‘లండన్ ఒలింపిక్స్ ఈవెంట్ ద్వారా, వాణిజ్య ప్రకటనల ద్వారా నాలుగు బిలియన్ల డాలర్లు సేకరించగలిగితే అంగారకుడి మీదకు వెళ్లడం ఎందుకు సాధ్యం కాదు? అంటారు ఆయన.
‘‘ఒలింపిక్స్ చూసినట్టుగానే మా ఈవెంట్‌ను కూడా ప్రజలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇదొక అద్భుతమైన సంఘటన’’ అన్నారు ఆరిందమ్ సాహా.
ఈ యాత్రకు ఎంపికైనవారు అంగారకుడి మీద నివాసాలు ఏర్పడతాయని ఆశావహంగా ఉన్నారు.
‘‘నేనొక ఉదాహరణగా ఉండాలనుకుంటున్నాను’’ అంటున్నారు విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న వినోద్ కోటియా.
‘‘భూమికి ఏదో జరిగిపోతుందని నేను ఎన్నటికీ అనుకోను. జీవితంలో లభించిన అదృషం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను’’ అన్నారు వినోద్ కోటియా.
- డా.వైజయంతి