స్పందన
అక్టోబర్ 10న ‘దైవికం’లో ‘ఖగోళ అవిశ్వాసి’ అనే శీర్షికతో స్టీఫెన్ హాకింగ్ మీద మాధవ్ శింగరాజు రాసిన ఆర్టికల్‌కి స్పందనగా ఈ ఉత్తరం. సైన్సు అన్న పదానికి నిర్వచనం, పరిధి అవగాహన చేసుకోకుండా ఆయన దీనిని రాశారనుకోవాలి. ఒక ప్రసిద్ధ మత పెద్ద దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడితే ఒక ఆస్తికుడికి వచ్చేంత బాధను ఆయన అనుభవించినట్లున్నారు! స్టీఫెన్ అలా మాట్లాడకపోవడం వింత కాదని, మన శాస్త్రవేత్తలు అంగారక గ్రహం మీదకు రాకెట్టు పంపేటప్పుడు పూజ చేయడం ఒక వైచిత్రి అని ఆయన గమనించలేకున్నారు.
‘సైన్సు లేని మతం కుంటిది, మతం లేని సైన్సు గుడ్డిది’ అన్న 20వ శతాబ్ది సువిఖ్యాత ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా ‘దేవుడి పట్ల నమ్మకం పిల్ల చేష్ట’, ‘మతానికి చెందిన కథలు మూఢనమ్మకాలు’ అని తన చివరి రోజుల్లో ప్రకటించాడని వాల్టన్ నెజాక్‌సన్ ఇటీవలి ఐన్‌స్టీన్ బయోగ్రఫీలో ప్రస్తావించాడని తెలిస్తే ఐన్‌స్టీన్‌ని మాధవ్ గారు ఎన్ని మాటలు అని ఉండేవారో!
మాధవ్ గారు సకల సృష్టినీ ఒకే కళ్లద్దాల ద్వారా చూస్తున్నట్లున్నారు. అందుకే ఆయన ‘విశ్వాసం’ అనే పదాన్ని ఆస్తికులకు ధారాదత్తం చేశారు. విశ్వాసం, నమ్మకం వంటి పదాలు పలు రకాల విషయాలకు ఆపాదితాలు అని మరిచారు. అసలు నాస్తికత కూడా ఒక విశ్వాసమే అని మరవడం దారుణం.
ప్రపంచమంతా దైవం, దాని ఆధారిత మతాల పట్ల నమ్మకం లేకపోవడం వల్ల గాక... ఆ నమ్మకం, విశ్వాసం ముదిరి మూఢంగా, మూర్ఖంగా తయారై సాటి జీవుల పట్ల వైషమ్యాలు, కక్షలు, హననాలకు కారణం అవుతున్నప్పుడు, ఇటువంటి వ్యాఖ్యల వల్ల (స్టీఫెన్ హాకింగ్ చేసిన వ్యాఖ్యల వల్ల ) వాటి కాఠిన్యం కాస్తయినా తగ్గి సకల సృష్టికి మంచి జరుగుతుందని ఆశిద్దాం.
- ఒక అజ్ఞేయతావాది (Agnostic)
నాస్తికత కూడా ఒక విశ్వాసమే అని మరచారు!
Published Fri, Nov 7 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement