'ఫేస్బుక్లో కాదు.. నిజంగా ఫ్రెండ్స్ అవ్వండి'
భారత్, పాకిస్థాన్ ప్రజలు తమ సంబంధాలను మెరుగుపర్చుకోవాలని, అయితే కేవలం ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో కాకుండా నిజ జీవితంలో ఫ్రెండ్స్ అవ్వాలని సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అన్నారు. పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ అహ్మద్ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో చాలాసార్లు పాకిస్థాన్ వెళ్లానని, అప్పుడు అక్కడివాళ్ల ప్రేమాభిమానాలు చవిచూశానని చెప్పారు.
ఏ ఒక్కసారీ అక్కడి ఆందోళనల కారణంగా తన ప్రదర్శనలు రద్దుచేసుకోవాల్సిన పరిస్థితి తనకు ఎదురు కాలేదని ఆయన తెలిపారు. ఖుర్షీద్ సొంత నగరమైన లాహోర్లో తనకు లభించిన లాంటి స్వాగతాన్నే ఆయనకు కూడా మనం ఇక్కడ ఇచ్చి ఉండాల్సిందని నసీరుద్దీన్ షా అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రధాన వక్త సుధీంద్ర కులకర్ణి మీద శివసేన కార్యకర్తలు నల్ల ఇంకు పోయడాన్ని అనాగరికమైన చర్యగా ఆయన విమర్శించారు. నల్ల ఇంకు పడినా కూడా అలాగే నల్లటి మొహంతో విలేకరుల సమావేశంలో పాల్గొనడం ద్వారా సుధీంద్ర కులకర్ణి అపార ధైర్యాన్ని ప్రదర్శించారని షా అన్నారు.