తదుపరి ప్రధాని మోదీయే కావాలట
తదుపరి ప్రధాని మోదీయే కావాలట
Published Fri, Jan 27 2017 3:09 PM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
భారతదేశానికి తదుపరి ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోదీ కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఇండియా టుడే, అధ్యయన సంస్థ కార్వీ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వే వెల్లడించింది. పాకిస్థాన్‌పై భారత్ జరిపిన సర్జికల్ దాడులను, దేశంలో పెద్ద నోట్ల రద్దును కూడా సర్వేలో పాల్గొన్న వారిలో మూడింట రెండొంతుల మంది సమర్థించారు. ఈ సర్వేలో ఎంపిక చేసుకున్న శాంపిల్ సంఖ్య తక్కువగా ఉంది. 12,143 మందిని ఇంటర్వ్యూ చేసి ఈ సర్వే నిర్వహించారు.
దేశంలోని 97 పార్లమెంట్ స్థానాలు, 194 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 53 శాతం గ్రామీణ, 47 శాతం పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రజలను ఎంపిక చేయడం ద్వారా ఈ సర్వేను శాస్త్రీయంగా నిర్వహించామని ఇండియా టుడే, కార్వీ ప్రకటించాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజీపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి 360 లోక్‌సభ స్థానాలు వస్తాయని కూడా సర్వే తెలిపింది. ఇండియా టుడే గతంలో నిర్వహించిన సర్వేలకన్నా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత పాయింట్లు 15 శాతం పెరిగాయి. ఆయన ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ స్కీమ్‌ను ఎక్కువ మంది సమర్థిస్తున్నారు. ఈ స్కీమ్‌కు 27 శాతం మంది ఓటేశారు.
ఆ తర్వాత మోదీ ప్రభుత్వం చేపట్టిన జన్‌ధన్ యోజనకు 16 శాతం, డిజిటల్ ఇండియాకు 12 శాతం మంది ఓటేశారు. పాకిస్తాన్‌తో సంబంధాలను మోదీ ప్రభుత్వం సవ్యంగా నర్వహించిందని 62 శాతం మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు వల్ల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రతిష్ట దెబ్బతిన్నదని, నిబంధనల విషయంలో గందరగోళం ఏర్పడిందని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని ఇంకా బాగా అమలుచేసే అవకాశం ఉండిందని 55 శాతం మంది అభిప్రాయపడ్డారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు సవ్యంగా జరగకుండా బీజేపీ, దాని మిత్రపక్షాలే అడ్డుపడ్డాయని 18 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ప్రధాన మంత్రి పదవికి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అని 28 శాతం మంది అభిప్రాయపడగా, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉత్తముడని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ రేటింగ్స్ గతంలో కన్నా సగానికి సగం పడిపోయాయి. ప్రతిపక్ష మహాకూటమికి ఆయన మంచి నాయకుడవుతారని 11 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. రానున్న బడ్జెట్‌లో ఆదాయపన్నును తగ్గించాల్సిన అవసరం ఉందని 68 శాతం మంది అభిప్రాయపడ్డారు.
Advertisement