భారతీయులను వీధుల్లోకి విసిరేస్తారా?
భారతీయులను వీధుల్లోకి విసిరేస్తారా?
Published Tue, Nov 5 2013 5:35 PM | Last Updated on Wed, Oct 17 2018 5:27 PM
పర్యాటక ప్రదేశంగా విదేశీయులను విశేషంగా ఆకర్షిస్తున్న గోవాలో నైజీరియా దేశస్థులకు, స్థానికులకు జరిగిన వివాద సంఘటన అంతర్జాతీయ స్థాయిలో జాతివివక్ష రంగు పులుముకునే దిశగా కదులుతోంది. అక్టోబర్ 31 తేది గురువారం రోజున 200 మంది డ్రగ్ సరఫరాకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నైజీరియా దేశస్థులు కొన్నిగంటలపాటు జాతీయ రహదారిని దిగ్భంధం చేసి నానాయాగీ చేశారు. జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న నైజీరియా దేశస్థులను అడ్డుకున్న స్థానికులను, పోలీసులపై తిరగపడటమే కాకుండా దాడికి పాల్పడ్డారు. దాంతో ఇరువర్గాల మధ్య వివాదం ముదిరింది. ఈ ఘటనలో నైజీరియా దేశస్థుడు తీవ్రంగా గాయపడ్డటం మరింత ఉద్రిక్తత పెంచింది. ఈ వివాదం స్థానికులకు, నైజీరియా దేశస్థులకు మధ్య దాడులకు తావిచ్చింది. నైజీరియన్లు పెద్ద ఎత్తున జరిపిన దాడులను అడ్డుకోవడం స్థానిక పోలీసులకు సవాల్ గా నిలిచింది.
దాంతో అక్రమంగా నివసిస్తున్న నైజీరియన్లను వారి జాతీయతను తెలిపే డాక్యుమెంట్లను పోలీసులు తనిఖీ చేశారు. అంతేకాక అక్రమ నైజీరియన్ల వివరాలను తెలుపుతూ నైజీరియా రాయబార కార్యాలయానికి గోవా ప్రభుత్వం లేఖ రాసింది. కేవలం పాస్ట్ పోర్ట్, వీసా జిరాక్స్ కాపీలతోనే నివసిస్తున్నారని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరిక్కర్ లేఖలో తెలిపారు. సరియైన ఆధారాలు లేని నైజిరియన్లను అద్దె గృహాల నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేపట్టారు.
గోవా ప్రభుత్వానికి సవాల్ గా మారిన డ్రగ్ మాఫియాను ఏరివేతలో భాగంగా అక్రమంగా నివసిస్తున్న నైజీరియన్లను ఖాళీ చేయించడంపై ఆదేశ రాయబార కార్యాలయ అధికారి జకోబ్ నదాదియా రెండు దేశాల మధ్య సామరస్యతను దెబ్బతీసే విధంగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నైజీరియన్లను ఖాళీ చేయించడం ఆపకపోతే.. తమ దేశంలో ఉన్న 10 లక్షల మంది భారతీయులను రోడ్లపైకి విసిరివేస్తాం అని వ్యాఖ్యలు చేశారు. నైజీరియన్లను గోవా నుంచి ఖాళీ చేయించడం ఆపి వేయాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది హెచ్చరిక చేశారు.
వివిధ దేశాలకు చెందిన టూరిస్టులు గోవాలో చోటుచేసుకున్న పరిస్థుతులపై ఆందోళన వ్యక్తం చేశారు. గోవా లాంటి కాస్మోపాలిటన్ ప్రదేశంలో జరిగిన దాడులకు జాతి వివక్ష రంగు అద్దడం ఉహించలేమని పలువురు టూరిస్టులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. గోవాలో చోటు చేసుకున్న వివాదాన్ని పరిష్కారించాల్సిన దౌత్య అధికారులే తమ హోదాను మరిచి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిస్తోంది.
Advertisement