భారత జవాన్ల 'ఈద్' మిఠాయిలను తిరస్కరించిన పాక్
వాఘా: ఇప్పుడప్పుడే పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితులు తలెత్తకముందే.. 'పొరుగు దేశం మిఠాయిలు చేదు' అన్నట్లుగా వ్యవహరించింది దాయాది పాకిస్థాన్. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పండుగల సందర్భంలో పరస్పరం పలకరించుకొని, మిఠాయిలు తినిపించుకునే సంప్రదాయానికి తెరదించింది. సరిహద్దుల్లో దశాబ్దాలుగా సాగుతోన్న పండుగ చెలిమికి మంగళం పాడింది.
శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకుని సరిహద్దు రక్షక దళం (బీఎస్ఎఫ్) ఇవ్వజూపిన మిఠాయిలు స్వీకరించేందుకు పాక్ సైనికులు నిరాకరించారు. ఈ ఉదయం వాఘా సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది. వాఘానే కాకుండా భారత్- పాక్ సరిహద్దుల్లోని ముఖ్యమైన స్థావరాన్నింటివద్దా ఇలాంటి పరిస్థితే నెలకొంది. 'పండుగ సందర్భంగా పొరుగు దేశం సైనికులకు స్వీట్లు ఇవ్వడం ఆనవాయితి. అయితే ఈ సారి మాత్రం వారు స్వీట్లు తీసుకునేందుకు నిరాకరించారు. ఏది ఏమైనా మేం కోరుకునేది శాంతినే' అని బీఎస్ఎఫ్ డీఐజీ ఎంఎఫ్ ఫారూఖ్ చెప్పారు.
పాక్ తీరుకు భిన్నంగా అసోం, మేఘాలయాల్లోని బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద భారత్, బంగ్లాల సైనికులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుని, స్వీట్లు తినిపించుకోవడం గమనార్హం. కశ్మీర్ అంశం ప్రస్తావన లేకుండా భారత్- పాక్ల మధ్య చర్చలు అసాధ్యమని పాక్ రక్షణ సలహాదారు అజీజ్ ప్రకటించినప్పటినుంచి సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం రెట్టింపయింది. గడిచిన పక్షంరోజుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరి పాక్ సేనలు భాతర జవాన్లు, సాధారణ పౌరులపై తుపాకి గుండ్ల వర్షం కురిపించాయి. రంజాన్ పండుగ నాడు కూడా భారత సైన్యం స్థావరాలపై పాక్ రేజర్లు పలు మార్లు కాల్పులు జరిపారు.