
సైన్స్ అభివృద్ధికి పరిశ్రమల సాయం అంతంతే
దేశంలో సైన్స్ అభివృద్ధికి పారిశ్రామిక రంగం అందిస్తున్న సాయం అంతంత మాత్రమేనని ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న సీఎన్‌ఆర్ రావు అన్నారు.
భారతరత్న సీఎన్‌ఆర్ రావు
న్యూఢిల్లీ: దేశంలో సైన్స్ అభివృద్ధికి పారిశ్రామిక రంగం అందిస్తున్న సాయం అంతంత మాత్రమేనని ప్రముఖ శాస్త్రవేత్త, భారతరత్న సీఎన్‌ఆర్ రావు అన్నారు. ఈ విషయంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన పారిశ్రామికరంగం తీసికట్టుగా ఉందన్నారు. మనదేశంలో సైన్స్ అభివృద్ధికి వెచ్చిస్తున్న వ్యయంలో 90 శాతం వాటా ప్రభుత్వానిదేనని తెలిపారు. ఎన్డీటీవీ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా శనివారమిక్కడ నిర్వహించిన చర్చాకార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్‌లో శాస్త్ర అభివృద్ధికి మరింత ప్రోత్సాహం, సహకారం అవసరమన్నారు. చర్చలో వ్యవసాయ నిపుణుడు స్వామినాథన్, టీసీఎస్ సీఈఓ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, ఎన్డీటీవీ తన వార్షికోత్సవాల సందర్భంగా ‘భారత్‌కు చెందిన 25 మంది సజీవ ప్రపంచ దిగ్గజాల’ను ఆదివారం రాష్ట్రపతి భవన్‌లో అవార్డులతో సత్కరించింది. అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే విద్య, పరిశోధన రంగాల్లో భారీ పెట్టుబడులు పెట్టాలన్నారు. భారత్ వ్యవసాయ పరిశోధనకు ఖర్చు చేస్తున్న వ్యయం తక్కుగా ఉందని వ్యవసాయ నిపుణుడు స్వామినాథన్ ఆందోళన వ్యక్తం చేశారు. పురస్కారాలు అందుకున్న వారిలో స్వామినాథన్, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్, క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, కపిల్‌దేవ్, లియాండర్ పేస్, సినీనటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారుక్ ఖాన్, వహీదా రెహమాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రె హమాన్ తదితరులు ఉన్నారు.