పిల్లలకూ బాధ ఎక్కువే!
లండన్: శిశువులకు మెదడు ఎదుగుదల సరిగా ఉండదు కాబట్టి నొప్పి కలిగినపుడు వారికి ఆ బాధ అంతగా ఉండదని చాలా మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఏదైనా నొప్పి కలిగినపుడు శిశువులకు కూడా పెద్దవారిలాగే బాధ కలుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఒక్కటే తేడా... వారు ఆ బాధను పెద్దవారిలా వెలిబుచ్చలేరు. దీంతో వారు అంత బాధపడుతున్నట్లు అనిపించదు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పీడియాట్రిక్స్ నిపుణుడు రెబెక్కా స్లేటర్ నొప్పి సమయంలో పిల్లల్లో కలిగే బాధపై పరిశోధన చేశారు.
మాగ్నినెన్స్ రెసోనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్‌ఐ) స్కానింగ్ ద్వారా పిల్లలకు నొప్పి కలిగినపుడు వారి మెదడు ఎలా స్పందిస్తుందనే అంశాన్ని పరిశీలించారు. నొప్పి కలిగినపుడు పెద్దల మెదడు ఎలా స్పందిస్తుందో శిశువుల మెదడు కూడా అలాగే స్పందించడాన్ని పరిశోధకులు గమనించారు. ఒకటి నుంచి ఆరు సంవత్సరాల వయసు గల పిల్లల్ని, 23-36 సంవత్సరాల వయస్సున్న ఆరోగ్యవంతమైన యువకుల్ని వీరు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో పిల్లల్లో, పెద్దల్లో నొప్పి కలిగినపుడు మెదడులో ఒకే రకమైన మార్పులుండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.