ముంబై: నైపుణ్యమున్న ఉద్యోగులకు పాత కంపెనీల నుంచి మళ్లీ పిలుపులు వస్తున్నాయి. ఇన్ఫోసిస్, హిందూస్తాన్ యూనిలీవర్, గోద్రేజ్ , ఐటీసీ, బ్రిటానియా, టాటా, తదితర కంపెనీలు తమ మాజీ ఉద్యోగుల తలుపులు తడుతున్నాయి. తమను వదలి వెళ్లిన ప్రతిభ గల ఉద్యోగులను పిలిచీ మరీ ఆఫర్లిస్తున్నాయి. వాళ్లు కాదు అని చెప్పలేనంత ఆకర్షణీయమైన ప్యాకేజీని అందిస్తూ వారికి మళ్లీ ఉద్యోగాలిస్తున్నాయి.
ఇరువురికీ ప్రయోజనమే
ప్రస్తుతమున్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో వ్యయ నియంత్రణ లక్ష్యంగా ప్రతిభ గల ఉద్యోగులకే కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ విషయాన్ని టాటా కెమికల్స్ హెచ్‌ఆర్ హెడ్ ఆర్. నంద ధ్రువీకరించారు. నైపుణ్యమున్న ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలివ్వడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఇక ఈ రీ హైరింగ్ కారణంగా కంపెనీలకు, మాజీ ఉద్యోగులకు ఇరువురికీ ప్రయోజనాలుంటున్నాయి. రీ హైరింగ్ కారణంగా కంపెనీల ఉద్యోగ వ్యయాలు కూడా తగ్గుతున్నాయి. అంతే కాకుండా పాత ఉద్యోగికి కంపెనీ కార్యకలాపాలు, పని సంస్కృతి వంటివి ఇదివరికే తెలిసి ఉంటాయి.
కాబట్టి కొత్త ఉద్యోగులతో పోల్చితే మాజీ ఉద్యోగుల ఉత్పాదకతే బావుంటుందని కూడా కంపెనీలు భావిస్తున్నాయి. కొత్త వాళ్లకు ఉద్యోగాలివ్వడం ఎక్కువ కాలహరణంతో కూడిన పని అని అంతర్జాతీయ ఐటీ సర్వీసుల సంస్థ కంప్యూటర్ సెన్సైస్ కార్పొ భారత విభాగం వైస్ ప్రెసిడెంట్ (హెచ్‌ఆర్) శ్రీకాంత్ కె. అరిమంత్య పేర్కొన్నారు. మాజీ ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలివ్వడంతో చాలా సమయం ఆదా అవుతుందన్నారు. వార్షిక ఉద్యోగ వ్యయాల్లో మూడో వంతు ఆదా అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక మాజీ ఉద్యోగులు కూడా పాత కంపెనీలకే జై కొడుతున్నారు. గతంలో కంటే మంచి స్థానం, ఎక్కువ జీత భత్యాలు లభిస్తుండడం, ఇత్యాది కారణాల వల్ల మాజీ ఉద్యోగులు మళ్లీ పాత గూటికే చేరుతున్నా రు. ఇక కంపెనీలు అన్ని స్థాయి ఉద్యోగాల్లో మాజీ ఉద్యోగులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి.
గ్రీన్ హైరింగ్ చానెల్
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగులకు మళ్లీ కొలువులివ్వడాన్ని ‘గ్రీన్ చానెల్’ హైరింగ్‌గా వ్యవహరిస్తోంది. ఈ రీ హైరింగ్ ద్వారా తాము బాగా ప్రయోజనం పొందామని, భవిష్యత్తులో కూడా దీనిని అమలు చేయడం కొనసాగిస్తామని కంపెనీ అంటోంది. తమ గ్లోబల్ అలుమ్ని నెట్‌వర్క్ ద్వారా మాజీ ఉద్యోగులను సంప్రదిస్తున్నామని ఇన్ఫోసిస్ హెచ్‌ఆర్. గ్లోబల్ హెడ్ శ్రీకాంతన్ మూర్తి తెలిపారు. ఫేస్‌బుక్, లింక్‌డెన్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారా తమ మాజీ ఉద్యోగులను కంపెనీలు సంప్రదిస్తున్నాయి.
మాజీ ఉద్యోగులకు పిలుపులు
Published Fri, Jan 3 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement