సెంట్రల్‌ హాలుకు అవమానం? | insult to parliament central hall, writes mahesh vijapurkar | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ హాలుకు అవమానం?

Published Tue, Jul 4 2017 1:33 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM

సెంట్రల్‌ హాలుకు అవమానం?

సెంట్రల్‌ హాలుకు అవమానం?

విశ్లేషణ
మన ప్రతినిధులుగా ఎంచుకుంటున్న అభ్యర్థుల విషయంలో ఓటర్లుగా పదే పదే తప్పు చేస్తూ వస్తున్నామా? లేక, మన ప్రజాస్వామ్యం తక్షణ పునాది, రాజకీయ నాయకత్వం నాణ్యత అనేవి దిగజారిపోతున్నాయా? రెండూ కావచ్చు.

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ నుంచి వస్తుసేవల పన్ను(జీఎస్టీ)ని అర్ధరాత్రి ప్రారంభించడం.. 1947ని అవమానించేదని కాంగ్రెస్‌ పార్టీ అభిప్రాయం. జవహర్‌లాల్‌ నెహ్రూ సుప్రసిద్ధమైన ప్రసం గం ‘ట్రిస్ట్‌ విత్‌ డెస్టినీ‘తో అధికార మార్పిడి జరిగిన సందర్భం అది. జీఎస్టీ ప్రారంభోత్సవ ఘటనను బహిష్కరిం చడం ‘సైద్ధాంతిక‘ పరమైనదని కాంగ్రెస్‌ చెప్పుకుంది.

సెంట్రల్‌ హాల్‌ అనేది సంసద్‌ భవన్‌లో ఒక భాగం. ఇక్కడే లోక్‌సభ, రాజ్యసభ కూడా ఉన్నాయి. ఇక్కడినుంచి చర్చ, వాదన ద్వారా, ఏకాభిప్రాయం లేదా వోటింగ్‌ ద్వారా నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాస్వామ్య వ్యవహారాలను నిర్వహిస్తూంటారు. ఉభయ సభలు సమావేశమైనప్పుడు సెంట్రల్‌ హాల్‌ నుంచే రాష్ట్రపతి ప్రసంగిస్తారు. మన రాజ్యాంగాన్ని కూడా ఇక్కడే ఆమోదించారు. అందుచేత సెంట్రల్‌ హాల్‌ అలనాటి ఉజ్వల ఘటనలకు సంబంధించిన మ్యూజియం కాదు. పార్లమెంటరీ వ్యవహారాల నిర్వహణకు చెందిన కీలకమైన స్థలం. పార్లమెంటులో ప్రసంగించేందుకు ఏ ముఖ్య నేతనయినా ఆహ్వానించినప్పుడు సెంట్రల్‌ హాల్‌లోనే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్‌ ఆనంద్‌ శర్మ ‘అవమానం’ అని మాట్లాడుతున్నారంటే దానిని జీఎస్టీ ప్రారంభోత్సవానికి హాజరు కాకపోవడంపై కాంగ్రెస్‌ తరఫున చేసిన సానుకూల సమర్థనగానే చెప్పాల్సి ఉంటుంది.

పార్లమెంటు పట్ల రాజకీయ వర్గం వైఖరిని పరి శీలించడానికి ఈ పరిణామం ఒక కారణాన్ని మనకు అందిస్తుంది. కాంగ్రెస్‌ కానీ, మరే ఇతర పార్టీ కాని సెంట్రల్‌ హాల్‌ పట్ల గౌరవభావాన్ని ప్రదర్శించే సందర్భాల్లో దానిలో జరిగే కార్యక్రమాల పట్ల ఆ పార్టీల వైఖరి ఇలా ఉండదు. సెంట్రల్‌ హాల్‌ పట్ల గౌరవ ప్రదర్శన అనేది లోక్‌ సభ, రాజ్యసభల్లో వ్యవహారాలను నిర్వహిస్తున్న పార్టీల వైఖరి బట్టి ఉండకూడదు.

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఇటీవలే పార్లమెంటేరియన్లను తీవ్రంగా మందలించారు. ‘‘మీ బాధ్యతను మీరు నిర్వర్తించండి. పార్లమెంటులో వ్యవహారాలను నిర్వహించడానికి మీరున్నారు.’’ పార్లమెంట్‌ కార్యకలాపాలకు అంతరాయాలు కలిగించడం అమోదించదగినది కాదు. ఉభయ సభల్లో గలాభా కొనసాగడం వల్ల గంటల కొద్దీ అమూల్య సమయం వృథా కావడం కొనసాగుతోందని, ఇలా కొనసాగితే సెంట్రల్‌ హాల్‌లో ఆమోదం పొందిన రాజ్యాంగం సూచించినట్లుగా పార్లమెంటు ఉద్దేశమే ఓటమికి గురవుతుందనడానికి రాష్ట్రపతి వద్ద బోలెడు రుజువులున్నాయి కూడా.

రాష్ట్రపతి ఆగ్రహాన్ని పౌరుల తీవ్ర వ్యాకులతతో సరిపోల్చవచ్చు. పార్లమెంటు కార్యకలాపాలను విచ్ఛిన్నపర్చడం తప్ప ఎంపీలనుంచి మరేమీ ఆశించలేమని పౌరులు ఒక స్థిరమైన అభిప్రాయానికి వచ్చేశారు. బీజేపీకి చెందిన అరుణ్‌ జైట్లీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కపటధోరణితో వాదిస్తూ, విచ్ఛిన్నపర్చటం, అవరోధాలు కల్పించడం ప్రయోజనకరమైనవేననీ, పార్లమెంటు సజావుగా సాగిపోతే ప్రభుత్వం చర్చల ద్వారా తప్పించుకునే అవకాశముంటుందని వ్యాఖ్యానించారు.

పార్లమెంట్‌ కార్యకలాపాలను విచ్ఛిన్నపర్చని రాజకీయ పార్టీని చూడటం ఇప్పుడు చాలా కష్టం. కాబట్టి పార్లమెంటులో ఏ ప్రదేశానికైనా సరే అవమానం జరిగిందని ఏ రాజకీయ నేత అయినా మాట్లాడుతున్నాడంటే అది అబద్ధం కాదు. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడైనా పార్లమెంటు కార్యకలాపాలను మృదువుగా సాగేటట్లు చేసి ఉంటే,  కొత్తగా అధికారంలోకి వచ్చిన పాలక సంకీర్ణ కూటమిని కూడా అలాగే ఉండాలని డిమాండ్‌ చేస్తే అది నిజాయితీ ప్రదర్శించినట్లు లెక్క. చర్చకు, వాదనకు సంబంధించిన వేదికను నిత్య ప్రతి ష్టంభన వేదిక స్థాయికి కుదించకూడదు.

పార్లమెంటు కార్యకలాపాలను పదే పదే విచ్ఛిన్నపర్చే అలవాటును కొనసాగిస్తూ సెంట్రల్‌ హాల్‌ గౌర వం గురించి పేర్కొనడం అసంబద్ధమైన విషయం. ఒకప్పుడు ప్రతిపక్షం వాకౌట్‌ చేయడమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే పద్ధతిగా ఉండేదని అనిపిస్తుంది. సంఖ్యాబలం లేని ప్రతిపక్షం మెజారిటీ సాధిం చేందుకు ప్రయత్నిస్తుందనీ, విచ్ఛిన్నకర విధానాలతో వ్యవహరించేందుకు ప్రభుత్వానికి ఎప్పుడూ ఓ మార్గం ఉంటుందనుకోవడం తప్పుడు అవగాహన మాత్రమే.

అత్యధిక భాగం నిరక్షరాస్యులుగా ఉన్న దేశ జనాభాచే ఎన్నికైన తొలి లోక్‌సభ ఉన్నట్లుండి పెద్దమనిషి తనంలోకి మారిపోయి పార్లమెంటు కార్యకలాపాల్లో ఒక గంట సమయం కూడా వృథాపర్చకుండా గడపటం సూచ్యార్థంగా కనబడుతుంది. ఆనాడు అలా జరిగిందంటే ఆనాటి నేతల నడవడికే కారణం. గత శీతాకాల సీజన్‌లో 16వ లోక్‌సభ సమయంలో 30 శాతం, రాజ్యసభ సమయంలో 35 శాతం కేవలం విచ్ఛిన్నకర చర్యలవల్లే వృథా అయిపోయాయి.

కాబట్టి ఇప్పుడు ఉనికిలోకి వస్తున్న ప్రశ్న ఏదంటే, మన ప్రతినిధులుగా ఎంచుకుంటున్న అభ్యర్థుల విషయంలో ఓటర్లుగా మనం పదే పదే తప్పు చేస్తూ వస్తున్నామా అన్నదే. లేక, మన ప్రజాస్వామ్యం తక్షణ పునాది, రాజకీయ నాయకత్వం నాణ్యత అనేవి తీవ్రంగా పతనమవుతున్నాయా? రెండూ కావచ్చు. కానీ రాజకీయ ప్రపంచపు ద్వంద్వత్వంలో రెండు విరుద్ధ రాజకీయాల మధ్య సహకారం అనేది చిట్టచివరి అంశంగా మారుతోంది.


- మహేష్‌ విజాపృకర్‌

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ : mvijapurkar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement