
అవును.. అది అవమానమే! : బొత్స సత్యనారాయణ
రాష్ట్రాన్ని విభజించొద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు తాను హైకమాండ్‌కు పదేపదే విజ్ఞప్తి చేసినా వినకపోవడం తమకు తలవొంపేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజించొద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు తాను హైకమాండ్‌కు పదేపదే విజ్ఞప్తి చేసినా వినకపోవడం తమకు తలవొంపేనని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అయినప్పటికీ సమస్యలకు భయపడి పారిపోబోమని, రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించేందుకు చివరి వరకు ప్రయత్నిస్తామని చెప్పారు. అందులో భాగంగా రాష్ట్ర అసెంబ్లీలో విభజన అంశాన్ని మూకుమ్మడిగా వ్యతిరేకించాలని నిర్ణయించామన్నారు. తద్వారా విభజన ప్రక్రియ ఆగిపోయే అవకాశముందని రాజ్యాంగ, న్యాయ నిపుణులు సూచించారని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం తన నివాసంలో బొత్స మీడియాతో మాట్లాడుతూ తాను పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తమ ప్రాంత ప్రజల మనోభావాల మేరకు వ్యవహరిస్తానన్నారు. సీమాంధ్రలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఏపీఎన్జీవోలు వెంటనే సమ్మె విరమించాలని కోరారు. రాష్ట్ర విభజనవల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించే బాధ్యతను తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అందులో భాగంగా విభజన అంశంపై ఎప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతూ తగిన కార్యాచరణ రూపొందించుకునేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలతో ఓ కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. విజయనగరంలో తన నివాసంపై, విద్యా సంస్థలపై జరిగిన దాడి ఎవరు చేశారనే అంశం జోలికి వెళ్లనన్నారు. విభజన విషయంలో ఎవరేం చెప్పినా అధికారంలో ఉన్నది కాంగ్రెస్సే కాబట్టి ఆ దృష్టితో దాడి చేశారని భావిస్తున్నానన్నారు. ప్రజలంతా కాంగ్రెస్‌ను చులకన చేస్తుంటే బాధేస్తుందని, దీనిని ఏ విధంగా అధిగమించాలి? పార్టీని బలోపేతం చేసేదేలా? అనే అంశాన్ని ఆలోచిస్తున్నామన్నారు. తొందర్లోనే కాంగ్రెస్‌ను పటిష్టం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్‌లపై ధ్వజమెత్తారు. సీమాంధ్రలో ప్రజలు ఉద్యమిస్తున్నా చంద్రబాబు మాత్రం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
సీఎం రమేశ్‌ను కలసిన మాట నిజమే
తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తనను కలసిన మాట వాస్తవమేనని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అంగీకరించారు. ఈ విషయంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘నేను మంత్రిని. ఆయన ప్రజాప్రతినిధి. కలిస్తే తప్పేముంది? అందులో రహస్యమేముంది? వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ నాయకులు కూడా వివిధ సమస్యలపై నా వద్దకు వస్తారు కదా!’ అన్నారు. సీఎం రమేశ్ ఏ సమస్య పరిష్కారం కోసం మీ దగ్గరకు వచ్చారన్న ప్రశ్నకు ‘సమస్యలన్నీ మీకు చెబుతామా? మాకేం అవసరం? ఇదేం పద్ధతండీ...అసలు మీడియా ఎక్కడికి వెళుతుందో అర్ధం కావడం లేదు’’అంటూ అసహనం ప్రదర్శించారు.