పార్లమెంటుపై మళ్లీ ఉగ్రవాద దాడి కుట్ర!
న్యూఢిల్లీ: భారత్ పార్లమెంటుపై 2001లో జరిగిన దాడి పునరావృతం కానుందా?. తాజాగా భారత ఇంటెలిజెన్స్ అధికారులు జారీచేసిన హెచ్చరికలు ఈ విషయాన్నే నిర్ధారిస్తున్నాయి. నిర్దేశిత దాడులతో చావుదెబ్బ తిని పగతో రగిలిపోతున్న పాకిస్తాన్ నిఘా సంస్ధ ఐఎఐ భారత పార్లమెంటుపై దాడి చేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకోసం ఉగ్రసంస్ధ జైష్ ఏ మొహమ్మద్ (జేఈఎమ్) సాయం కోరినట్లు తెలిసింది.
దీంతో పార్లమెంటుపై మళ్లీ దాడిచేసేందుకు జేఈఎమ్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ వ్యూహం రచిస్తున్నట్లు భారతీయ ఇంటెలిజెన్స్ సంస్ధలు హెచ్చరించాయి. ఎలాగైనా పార్లమెంటుపై దాడిచేయాలని అజర్ నుంచి ఆపరేటివ్స్ కు ఇప్పటికే సూచనలు అందినట్లు తెలిసింది.
మావవబాంబు ప్రయత్నం పార్లమెంటుపై ఫలించకపోతే, ఢిల్లీ సెక్రటరియేట్, అక్షరధామ్, లోటస్ టెంపుల్ లపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. వీటిపై దాడి కుదరకపోతే జనాభా ఎక్కువగా ఉండే మార్కెట్లలో మానవ బాంబును ప్రయత్నించాలనే సూచనలు కూడా జేఈఎమ్ ఆపరేటివ్స్ కు ఉన్నాయి.
ఈ మేరకు భారత ఇంటెలిజెన్స్ వివిధ శాఖల అధికారులను హెచ్చరించింది. పార్లమెంటు భద్రతలో లోపాలను సరిచేసేందుకు ఆప్ నేత తీసిన వీడియోను (పార్లమెంటు పరిసరాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు) ఇంటెలిజెన్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కాగా, ఇప్పటికే ఇద్దరు జేఈఎమ్ టెర్రరిస్టులు ఫిదాయీ (మానవబాంబు) కావడానికి ఆపిల్ పండ్ల ట్రక్కు ద్వారా మారణాయుధాలతో ఢిల్లీలోని ఓ మార్కెట్ కు వచ్చినట్లు ఇంతకుముందు ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వచ్చాయి.
2012 ఫిబ్రవరిలో ఢిల్లీలో చివరగా ఉగ్రదాడి జరిగింది. ప్రస్తుతం పాక్ లో ఉంటున్న మసూద్ అజర్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, కశ్మీర్ లలో దాడులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఐఎస్ఐ పిలుపుతో మళ్లీ ఢిల్లీలో నరమేధం సృష్టించేందుకు అఫ్ఘానిస్థాన్‌కు చెందిన మరో ఉగ్రసంస్ధ, జేఈఎమ్ లో చీలిక జైషుల్-హక్ తంజీమ్ తో చేతులు కలిపినట్లు తెలిసింది.
జైషుల్-హక్ తంజీమ్ చీఫ్ మౌలానా అబ్దుర్ రెహమాన్ భారతదేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించేందుకు గతంలో కుట్ర పన్నాడు. ఇద్దరు ఎంఏఆర్ రిక్రూటర్లు అహ్మద్ ఖాన్ దుర్రాని, అహ్మద్ ఖాద్రీలు గత ఏడాది నవంబర్ లో కాబుల్ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఆరు ప్రదేశాల్లో బాంబు పేలుళ్లకు కుట్రపన్నగా అనుకోకుండా పేలుడు సంభవించడంతో పారిపోయారు.