వీసా టూరిస్టుది.. వెళ్లేది కిడ్నీ విక్రయానికి | International Links in Nalgonda Kidney Racket | Sakshi
Sakshi News home page

వీసా టూరిస్టుది.. వెళ్లేది కిడ్నీ విక్రయానికి

Published Fri, Jan 8 2016 1:10 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

వీసా టూరిస్టుది.. వెళ్లేది కిడ్నీ విక్రయానికి - Sakshi

వీసా టూరిస్టుది.. వెళ్లేది కిడ్నీ విక్రయానికి

* కిడ్నీ రాకెట్‌లో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి
* దేశవ్యాప్తంగా నలుగురు ఏజెంట్ల కీలకపాత్ర!
* గతంలోనూ హైదరాబాద్ కేంద్రంగా మూడుసార్లు రాకెట్ బట్టబయలు
* కేంద్రం పట్టించుకుంటేనే ఈ రాకెట్‌కు చెక్

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్‌లో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ రాకెట్‌తో సంబంధం ఉండి కిడ్నీలు అమ్ముకున్న వారందరూ టూరిస్టు వీసాలపై శ్రీలంకకు వెళ్లారని పోలీసుల విచారణలో తేలింది.

నల్లగొండ జిల్లాతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లిన వీరు కొలంబోలో ఉన్న ఏజెంట్లను కలసి కిడ్నీలు అమ్ముకుని గుట్టుచప్పుడు కాకుండా తిరిగి వచ్చినట్టు వెల్లడైంది. ఈ రాకెట్‌తో సంబంధమున్న నలుగురిని నల్లగొండ పోలీసులు బుధవారంరాత్రి అరెస్ట్ చేసిన విషయం విదితమే.   ఈ రాకెట్‌లో దేశవ్యాప్తంగా నలుగురు ఏజెంట్లు కీలకపాత్ర పోషిస్తున్నట్టు పోలీ సు విచారణలో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. దేశంలోని మిగతా రాష్ట్రాలకు చెందిన వారే కీలకంగా ఉన్నారని తెలుస్తోంది. అందులో కూడా పశ్చిమబెంగాల్ కేంద్రంగా ఈ రాకెట్ సూత్రధారులు పనిచేస్తున్నట్టు సమాచారం.

పోలీసుల దర్యాప్తులో కూడా బెంగాల్ రాష్ట్రానికి చెందిన కొందరు కొలంబో వెళ్లి కిడ్నీలు అమ్ముకున్నట్టు తేలింది. వీరిని నల్లగొండకు చెందిన కీలక పాత్రధారి ఇంటర్నెట్‌లో పరిచయం చేసుకున్నా, అక్కడ ఉన్న కీలక ఏజెంట్లతో కలసి వారిని శ్రీలంకకు పంపారని తెలుస్తోంది. అయితే, ప్రతిసారీ ఈ ఏజెంట్లు శ్రీలంకకు వెళ్లలేదని, అక్కడ ఉన్న మూడు ఆసుపత్రుల నెట్‌వర్క్‌తోపాటు మరికొంత మంది వ్యక్తుల సాయంతో ఒక్కొక్కరే వెళ్లి కిడ్నీలు అమ్ముకుని వచ్చారని తెలుస్తోంది. ఇక్కడి కీలక వ్యక్తులు అక్కడి ముఠాలోని ఏజెంట్లకు సమాచారం ఇస్తారని, వారి ఫోన్ నంబర్లు, అడ్రస్‌లు ఇక్కడే కిడ్నీ దాతలకు ఇచ్చి పంపిస్తారని పోలీసుల అదుపులో ఉన్న నిందితులు వెల్లడించినట్టు తెలుస్తోంది.
 
ట్రాన్స్‌ప్లాంటేషన్ ఖర్చు తక్కువ
ఈ రాకెట్‌తో శ్రీలంకకు సంబంధాలు ఉండేందుకు రెండు కారణాలు ఉన్నాయని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. కిడ్నీ మార్పిడికి అయ్యే ఖర్చు శ్రీలంకలో చాలా తక్కువ(మన దేశంతో పోలిస్తే) ఉంటుందని, దీంతో పాటు కిడ్నీ మార్పిడి కోసం అవసరమైన న్యాయపరమైన డాక్యుమెంట్లను సమర్పించడం కూడా సులువుగా ఉంటుందని, అందుకే కిడ్నీ కుంభకోణం అంటేనే వేళ్లు శ్రీలంక వైపు చూపెడుతున్నాయని పోలీసులంటున్నారు.
 
గతంలోనూ మూడుసార్లు

గతంలో కూడా హైదరాబాద్ కేంద్రంగా మూడుసార్లు ఈ కిడ్నీ రాకెట్ బయటకు వచ్చింది. ప్రస్తుత డీజీపీ అనురాగ్‌శర్మ సిటీ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్నప్పుడు కూడా కిడ్నీ డొంక కదిలించారు. అప్పుడు కూడా శ్రీలంకతో సంబంధాలున్నట్టు తేలింది. మరోసారి శ్రీలంకతో, ఇంకోసారి ఇరాన్‌తో కిడ్నీ రాకెట్‌కు సంబంధాలున్న కేసులు కూడా పోలీసులకు లభించాయి.  ఎన్నిసార్లు కిడ్నీ రాకెట్ బయటకు వచ్చినా కేసును ఛేదించలేకపోయారు.

ఈ రాకెట్లకు అంతర్జాతీయ సంబంధాలున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుందని, జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరపాల్సి ఉంటుందని, ఈ కేసుల విషయంలో ఇతర దేశాల సహకారం కూడా అవసరం ఉంటుందని రాష్ట్రస్థాయిలో పనిచేస్తోన్న ఓ పోలీసు అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ వ్యాఖ్యానించడం గమనార్హం.  
 
శ్రీలంకకు వెళ్తాం
ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకుగాను శ్రీలంకకు వెళ్లే యోచనలో జిల్లా పోలీసులున్నట్టు తెలుస్తోంది. తమకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను అడిగే యోచనలో జిల్లా పోలీసులున్నారు. ‘ఈ కేసును మేమే దర్యాప్తు చేయాలనుకుంటున్నాం. అందుకుగాను శ్రీలంకకు వెళ్తామని ప్రభుత్వాన్ని అనుమతి అడుగుతాం. మాకు అనుమతి లభిస్తే మేమే వెళ్తాం. లేదంటే అప్పుడు ఈ కేసును సీఐడీకి లేదా ఇతర దర్యాప్తు సంస్థలకు అప్పగించే దిశలో నిర్ణయం తీసుకోవచ్చు. అప్పటివరకు కేసు మా దగ్గరే ఉంటుంది.’ అని జిల్లాకు చెందిన ఓ పోలీసు ఉన్నతాధికారి ‘సాక్షి’కి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement