‘హెలెన్’ ఫొటో పంపిన మామ్
చెన్నై: అరుణగ్రహంపై పరిశోధనకు ఇస్రో పంపిన మంగళ్‌యాన్(మార్స్ ఆర్బిటర్ మిషన్-మామ్) ఉపగ్రహం తొలిసారిగా భూమికి ఫొటోలను పంపింది. భారత ఉపఖండంతోపాటు ఆఫ్రికాలోని పలు ప్రాంతాలను ఫొటోలు తీసి భూమికి పంపింది. ఆంధ్రప్రదేశ్ తీరం వైపుగా కదులుతున్న హెలెన్ తుపానునూ (చిత్రంలోని వృత్తంలో చూడవచ్చు) ఉపగ్రహం తన చిత్రంలో బంధించడం అసలు విశేషం. పరికరాల పనితీరును పరీక్షించడంలో భాగంగా ఆదేశాలు పంపగా... ఉపగ్రహంలోని మార్స్ కలర్ కెమెరా మంగళవారం (19న) పలు ఫొటోలు తీసి పంపిందని ఈ మేరకు గురువారం ఇస్రో వర్గాలు వెల్లడించాయి.
అయితే హెలెన్ సైక్లోన్ కనిపించేలా భారత్‌తోపాటు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ తీసిన ఫొటోను మాత్రమే ఇస్రో తన వెబ్‌సైట్ ద్వారా విడుదల చేసింది. మామ్‌లో ఐదు పరికరాలుండగా.. తొలి పరీక్షలో భాగంగా కలర్ కెమెరాను పరీక్షించింది. ప్రస్తుతం భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతున్న మామ్ డిసెంబర్ 1న అంగారకుడి వైపు ప్రయాణం ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.