ఇస్రో నెక్ట్స్ టార్గెట్ ఏమిటో తెలుసా?
తిరుపతి: అరుణ గ్రహంపై పరిశోధనకు పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం) విజయవంతం కావటంతో రెట్టించిన ఉత్సాహంతో ఇస్రో గ్రహాంతర యానాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా శుక్రుడు, అంగారక గ్రహాలపైకి పరిశోధక ఉప్రగహాలను పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు ఇస్రో అసోసియేట్ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు వెల్లడించారు.
తిరుపతిలో జరుగుతున్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. వచ్చే ఏడాదిన్నరలోగా శుక్ర గ్రహంపైకి ఉపగ్రహాన్ని పంపే అవకాశాలున్నాయని తెలిపారు. మొదట శుక్రుడిపైకి ఉపగ్రహాన్ని పంపుతామని, ఆ తర్వాత అంగారక గ్రహంపైకి మరో ఆర్బిటర్‌ను పంపిస్తామని తెలిపారు. దీంతోపాటు చంద్రయాన్-2కు సంబంధించి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు. చంద్రునిపైకి వచ్చే ఏడాదిలోగా రోబోను పంపేందుకు ఇస్రో సొంతంగా ప్రయత్నిస్తున్నదని ఆయన వెల్లడించారు.