హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌పై సోమవారం కూడా స్పష్టత రాలేదు. అన్ని కాలేజీలకు సంబంధించిన కేసులను జేఎన్టీయూహెచ్ ఫైల్ చేయనందున ఈ కేసు విచారణను హైకోర్టు బుధవారానికి (ఈనెల 15కు) వాయిదా పడింది. మరోవైపు ప్రవేశాల ముగింపు, తరగతుల ప్రారంభ గడువు సమీపిస్తోంది. బుధవారం నాటి విచారణలో ప్రవేశాలపై స్పష్టతరాకపోతే.. ఈ నెలాఖరుకు ప్రవేశాలు పూర్తయి, వచ్చే నెల 1న తరగతులు ప్రారంభం కావడం కష్టమనే అభిప్రాయాన్ని అధికారులే వ్యక్తం చేస్తున్నారు. ఇక కాలేజీల అఫిలియేషన్ల కేసులో సోమవారం స్పష్టత వస్తుందని, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎదురుచూసిన తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళనలో మునిగిపోయారు.
కౌన్సెలింగ్‌కు అనుమతి వస్తేనే..
ఇంజనీరింగ్ ప్రవేశాల వ్యవహారంలో ఈనెల 15వ తేదీన స్పష్టత వస్తేనే నెలాఖరుకు ఒకటి, రెండు దశల ప్రవేశాల కౌన్సెలింగ్‌ను పూర్తి చేయవచ్చని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి చెప్పారు. 16న వెబ్ ఆప్షన్లు ప్రారంభించినా.. ఆ తరువాత 3 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందని, తర్వాతే సీట్లను కేటాయించాల్సి ఉంటుందని, విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు గడువు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియకు పది రోజులు పడుతుందని చెప్పారు. ఇక రెండోదశ కౌన్సెలింగ్‌కు కనీసం ఐదు రోజులు పడుతుందన్నారు. 15న స్పష్టత రాకపోతే ఆగస్టు 1న తరగతుల ప్రారంభం కష్టమేనని, ఇందుకు గడువు కోసం మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు.
రేపు తేలకపోతే కష్టమే!
Published Tue, Jul 14 2015 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM
Advertisement