డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి సంబంధించిన కార్యక్రమాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షించనుంది.
కొత్త నిబంధనలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం
న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి సంబంధించిన కార్యక్రమాలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షించనుంది. ఈ మేరకు కొత్త నిబంధనలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. భారత ప్రభుత్వం, వ్యాపార నిబంధనలు, కేటాయింపు 1961ను మార్చడానికి ఆమోదించిన రాష్ట్రపతి.. డిజిటల్ కార్యకలాపాలు డిజిటల్ చెల్లింపులతో కలిపి ప్రోత్సహించే బాధ్యతలను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని కేబినెట్ సెక్రెటేరియట్ వెల్లడించింది.
పౌరుల్లో చైతన్యం తీసుకురావడం, ఈ–గవర్నెన్స్‌ను ప్రోత్సహించడం, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు, డిజిటల్ సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సైబర్ సెక్యూరిటీకి భరోసా కల్పించడం తదితర కార్యక్రమాలను ఈ శాఖ నిర్వహించనుంది. పాత రూ.500, రూ.1,000 నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. నగదు లావాదేవీలను తగ్గించి క్రెడిట్, డెబిట్ కార్డులు, డిజిటల్ మాధ్యమంలో చెల్లింపులను ప్రోత్సహించేందుకు గత ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
గత ఏడాది డిసెంబర్‌లో డిజిటల్ లావాదేవీలను, నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కార్డులు, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం అంటే.. పన్ను ఎగవేగతను అరికట్టడం.. ప్రభుత్వానికి వచ్చే చెల్లింపులను నగదురహితంగా మార్చడం.. పౌరులకు ఆర్థిక చెల్లింపుల సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నగదు చెల్లింపులను తగ్గించడం.. నగదు ద్వారా జరిగే ఆర్థిక వ్యవస్థను తక్కువ నగదు లేదా నగదురహితంగా మార్చడమే అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.