తారల ఇంట పట్టుబడిన సొమ్ము రూ.100 కోట్లా?
చెన్నై : సినీ తారల ఇళ్లలో సాగిన ఐటీ దాడుల్లో రూ. వంద కోట్ల మేరకు లెక్కలోకి రాని నగదు, నగలు, ఆస్తులు చిక్కినట్టు సమాచారం. ఇందులో రూ. 2 కోట్లు విలువగల నగలు, మరో 2 కోట్లు నగదు సైతం ఉన్నట్టుగా ఆదాయపన్ను శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇళయదళపతి విజయ్, సంచనల నటి నయన తార, చెన్నై చిన్నది సమంతలతో పాటు నిర్మాతలు సెల్వకుమార్, సిబుతామీన్స్, కలైపులి థాను, మదురై అన్బు, దర్శకులు శింబు దేవన్, అన్బుసెలియన్, విజయ్ తండ్రి ఎస్‌ఏ చంద్రశేఖర్, పులి చిత్రంతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న వారి ఇళ్లు కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ వర్గాలు కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే.
బుధ, గురు వారాల్లో 400 మంది అధికారులు 35 చోట్ల తనిఖీలు చేశారు. చెన్నై, హైదరాబాద్, మదురై, కోయంబత్తూరు, కొచ్చిన్, తిరువనంతపురం తదితర 35 చోట్ల సాగిన ఈ తనిఖీల్లో వంద కోట్ల మేరకు నగదు, నగలు , ఆస్తులు లెక్కలోకి రానివి పట్టుబడ్డట్టు సమాచారం. పది మందికి చెందిన ఇళ్లు, కార్యాలయాలు, ఫామ్ హౌసుల్లో రెండు రోజుల పాటుగా సాగిన తనిఖీల్లో వంద కోట్ల మేరకు లెక్కలోకి రాని నగలు, నగదు, ఆస్తుల రికార్డులు, పత్రాలు బయట పడ్డట్టుగా సమాచారం.
అయితే, ఈ లెక్కలోకి రాని నగదు, నగలు, ఆస్తుల వివరాలు ఎవరి ఇళ్లల్లో, ఎక్కడ లభించిందోనన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచే పనిలో ఆదాయపన్ను శాఖ వర్గాలు ఉన్నట్టు సమాచారం. రూ. 30 కోట్ల మేరకు పన్ను ఎగవేత దిశగా వ్యవహరించి ఉన్న పది మందికి జరిమానా విధించేందుకు కసరత్తులు జరుగుతున్నట్టు తెలిసింది.