
జనగామలో ‘కప్యూల్ పిరమిడ్స్’!
రత్నాకర్‌రెడ్డి పరిశోధనలో వెలుగు చూస్తున్న కొత్త చరిత్ర
జనగామ : వరంగల్ జిల్లా జనగామ చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తుంది. గురువారం పురావస్తు పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి ఈ ప్రాంతంలోని చరిత్ర విశేషాలు వెల్లడించారు. జనగామ డివిజన్లో గతంలోనే నిలువు రాళ్లు, గృహ సమాధులు, చరిత్ర కలిగిన శిలలు వెలికితీసినట్లు తెలిపారు. జనగామ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే రహదారి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో పరుపు బండపై అనేక కప్యూల్ పిరమిడ్స్‌ను గుర్తించినట్లు తెలిపారు.
పిరమిడ్ రాక్ ఎత్తు 12 సెంటీమీటర్లు, వైశాల్యం 59 చదరపు సెంటీమీటర్లు ఉండగా, 3,072 సెంటీ మీటర్ల చుట్టూ కొలత ఉందని వివరించారు. దీనిపైనే నవీన శిలాయుగంలో కప్యూల్స్ చెక్కినట్లు కనిపించాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిశోధనలు ఎక్కువగా జరగక పోవడంతో ఇంతటి చరిత్ర బయటకు రాలేదన్నారు. రేఖా గ ణితాన్ని కప్యూల్స్‌పై చూపించారని ప్రపంచ పరిశోధకులు భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పుడు పిల్లవాడు జన్మించగానే లెక్కల కోసం అని కూడా ప్రచారంలో ఉందని చెప్పారు.
గ్రహాలు, రాశులు మొదలైన నక్షత్ర మండలాన్ని సంకేత రూపంతోపాటు మానవుని ప్రయాణ సంకేతాల కోసం కావచ్చని ఊహిస్తున్నారు. గుండ్రని రాళ్లపై ఒకే చోట 8,490 దెబ్బలను 72 నిమిషాలపాటు కొడితే 1.9 మిల్లీమీటర్ల కప్యూల్స్ ఏర్పడుతుందని పురావస్తుశాఖకు చెందిన జి.కుమార్ కనిపెట్టారని తెలిపారు.
జనగామలో 55 మానవ నిర్మిత కప్యూల్స్
జనగామలో పిరమిడ్ రాక్‌పై 55 వరకు మానవ నిర్మిత కప్యూల్స్ ఉన్నట్లు గుర్తించినట్లు పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి చెప్పారు. వీటి తయారు చేసేందుకు ఐదు లక్షల దెబ్బలు అవసరమన్నారు. దీంతో బలమైన విశ్వాసాలు ఆనాటి మానవ సమాజంలో ఉన్నాయని అంచనా వేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆది మానవుల రేఖాగణిత ప్రజ్ఞను ఆయన ప్రశంసించారు. జనగామలోని పిరమిడ్స్ బేసి సంఖ్యలో ఉండడం విశేషమన్నారు. ప్రతి దిక్కున ఒక్కొక్క కప్యూల్స్‌ని సుద్దముక్కతో కలపగా పిరమిడ్, రాంబస్, వృత్తం ఆకారాలు ఏర్పడుతున్నాయని వివరించారు.
పిరమిడ్ శిఖరాల లోపల వర్షపు నీరు నిండిన కొలను కూడా గుర్తించినట్లు వెల్లడించారు. బయ్యన్న కంచెలో వెలుగు చూసిన చారిత్రక ఆధారాలను భావి తరాలకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రత్నాకర్‌రెడ్డి కోరారు. జనగామ డివిజన్‌లోని చరిత్ర సంపదను ఒక్కచోటకు చేర్చి మ్యూజియం ఏర్పాటు చేయూలన్నారు. కాగా, ఈ పరిశోధనలో విద్యార్థులు శ్రీనివాస్, సఫి, ఇమ్రాన్ పాల్గొన్నారని రత్నాకర్‌రెడ్డి తెలిపారు.