చంద్రుడిపై నుంచి విద్యుత్
టోక్యో: భూమ్మీద పెట్రోలు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాలన్నీ తరిగిపోతున్నాయి.. వాతావరణం, మేఘాలు అడ్డురావడం, స్థల లేమి వంటి కారణాల వల్ల సౌర విద్యుదుత్పత్తీ కష్టసాధ్యం.. ఇలాంటి పరిస్థితుల్లో ఏకంగా చంద్రుడిపై సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, భూమిపైకి ప్రసారం చేసేందుకు ఒక సరికొత్త ప్రతిపాదనను జపాన్‌కు చెందిన షిమిజు కార్పొరేషన్ నిపుణులు తెరపైకి తెచ్చారు. దాని ప్రకారం.. చంద్రుడి భూమధ్యరేఖపై 11,000 కిలోమీటర్ల పొడవునా, దాదాపు 400 కిలోమీటర్ల వెడల్పుతో సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. వాటిని అక్కడక్కడా ఏర్పాటు చేసిన ప్రసార కేంద్రాలకు అనుసంధానించి.. అతి శక్తివంతమైన, సాంద్రత గల లేజర్లుగా మార్చి భూమిపైకి పంపుతారు. భూమిపై సుమారు 20 కిలోమీటర్ల వ్యాసంతో ఏర్పాటు చేసిన గ్రహణ కేంద్రాలు.. ఆ శక్తిని గ్రహించి విద్యుత్‌గా మార్చి ప్రసారం చేస్తాయి. ఏకంగా 13,000 టెరావాట్ల (సుమారు 1300 కోట్ల మెగావాట్లు) విద్యుదుత్పత్తి చేయగల ఈ ప్రాజెక్టును.. 2035 సంవత్సరానికల్లా చేపట్టవచ్చని షిమిజు సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు.