రోబోల రాజ్యం.. | Japan's Henn Na Hotel Should Hire These Robots | Sakshi
Sakshi News home page

రోబోల రాజ్యం..

Published Mon, Jul 20 2015 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 5:48 AM

రోబోల రాజ్యం..

రోబోల రాజ్యం..

మీరెన్నో హోటళ్లలో ఉండి ఉంటారు.. చాలా వాటిని చూసి ఉంటారు.
కానీ ఈ రోజు మేం చెప్పబోయే హోటల్‌ను అయితే..
ఇప్పటివరకూ చూసి ఉండరు..
కావాలంటే మీరే చూడండి..
పదండి.. జపాన్‌లోని సాసెబోలో ఉన్న హెన్నా హోటల్‌లో ఓ టూరేసి వద్దాం..
రోబోల రాజ్యంలో అడుగుపెట్టి వద్దాం..

 
రిసెప్షన్..
హోటల్లోకి ఎంటరవగానే కనిపించే ఈ రాక్షసబల్లిని చూసి దడుచుకునేరు. మరేం పర్లేదు. రండి.. ఎందుకంటే.. ఇదిక్కడ రిసెస్షనిస్టుగా పనిచేస్తోంది. ఇది రోబోనే.. మనల్నేం అనదు.. ఇదే కాదు.. ఈ అమ్మాయి(ఇదీ రోబోనే), ఆండ్రాయిడ్ రోబో ఇవన్నీ ఇక్కడ రిసెప్షన్‌లోనే ఉంటాయి. మనం రాక్షసబల్లి వద్దకు వెళ్లామనుకోండి. ‘రూం కావాలంటే ఒకటి నొక్కండి’ అని అది ఎంతో వినయంగా చెబుతుంది. మనం అక్కడుండే కంప్యూటర్ మీద మన వ్యక్తిగత సమాచారం నింపి.. ఎంటర్ కొట్టాల్సి ఉంటుంది.. అంతే చెక్‌ఇన్ అయిపోయినట్లే..
 
క్లోక్ రూం..
రూంకు వెళ్లేముందు మనం బయట తిరగాలి అనుకుంటే.. అంతలోపు మన సామాన్లను అక్కడుండే క్లోక్ రూంలో ఉంచుకోవచ్చు. మన సామాన్లను డబ్బాలో ఉంచితే చాలు.. ఇక్కడ ఉండే భారీ రోబో చేయి వాటిని తీసి.. క్లోక్‌రూంలో పెడుతుంది.
 
బెల్‌బాయ్..
బయట తిరిగే పనిలేదు. నేరుగా రూంకు వెళ్లిపోదామనుకుని సామాన్లు పట్టుకెళ్లడానికి బాయ్ కోసం చూసేలోపే.. మరో రోబో వచ్చేసి.. మన సామాన్లను గది వద్దకు చేరుస్తుంది.
 
రూం ఎంట్రన్స్..
మిగతా హోటల్స్‌లా.. ఇక్కడ రూం కీలు, స్వైప్ కార్డులు ఉండవు. ఇందాక.. కంప్యూటర్‌లో మన వ్యక్తిగత వివరాలు నమోదు చేసినప్పుడే.. మన ఫొటో కూడా రిజిస్టరైపోతుంది. ఇక్కడ రూం తెరవడానికి మన మొహమే కీ అన్నమాట. అంటే.. అక్కడున్న స్క్రీన్‌పై మీరు మొహం ఉంచితే.. రూం ఓపెన్ అవుతుంది. బాగుంది కదూ..
 
రూం లోపల..
ఇక మన పడక పక్కనే మరో చిన్న రోబో. మీరు అడిగినప్పుడల్లా టైం, వాతావరణ వివరాలు చెబుతుంది. అంతేకాదు.. హోటల్‌లో లభించే వంటకాల వివరాలను తెలియజేసి.. ఆర్డర్ తీసుకుంటుంది. రూంలోని ఉష్ణోగ్రత కూడా మన శరీర ఉష్ణోగ్రతను బట్టి ఆటోమెటిక్‌గా మారుతుంటుంది. రూం సర్వీసును పిలవడానికి ఫోన్ ఎత్తాల్సిన పనిలేదు. అక్కడుండే ట్యాబ్‌ను తీసుకుని.. అందులో ఉండే వివరాల ఆధారంగా రూం సర్వీసును పిలవచ్చు.
 
ఇంకా..
ఇటీవలే ప్రారంభమైన ఈ హోటల్‌లో చాలా పనులు ఈ రోబోలే చేస్తాయి. వంట వండటం, బెడ్‌షీట్లు పరవడం, సెక్యూరిటీ వంటి పనులకు మాత్రం చేయలేవు. అయితే.. త్వరలో రూం సర్వీసును కూడా రోబోల చేతే చేయించాలని దీని యజమాని హిదియో అనుకుంటున్నారు. రోబోల వినియోగం వల్ల ఖర్చులు కూడా కలిసివస్తాయంటున్నారు. ఇంతకీ ఈ హోటల్‌లో ఓ రోజు ఉండాలంటే ఎంత చెల్లించాలో తెలుసా? కేవలం రూ.6 వేలే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement