జాబిల్లి మట్టిని ముట్టుకుంటే ఎలా ఉంటుంది? అంగారకుడిపై ఉండే అగ్నిపర్వతం ఎత్తు ఎంత? ఇవేమిటి.. వీటితోపాటు సుదూర గ్రహాల విషయాలు మీరు స్వయంగా అనుభూతి పొందే రోజు వచ్చేస్తోంది ఎలాగంటారా? మీ అవతారాలను రోబోల రూపంలో ఇతర గ్రహాలపైకి పంపేస్తే సరి అంటోంది జపాన్!
అవతార్ గుర్తుంది కదా.. హాలీవుడ్‌లో సూపర్‌హిట్ సినిమా ఇది. మనిషి పండోరా అనే గ్రహంపైకి వెళ్లడం.. ఆ గ్రహంపై హీరో ఓ యంత్రంలో పడుకుంటాడు. యంత్రం ఆన్ కాగానే.. అతడి మెదడులోని ఆలోచనలన్నీ ఆ గ్రహంపై ఉండే జీవి శరీరంలోకి చేరిపోతాయి. ఆ అవతారంతో గ్రహంపై హీరో కొన్ని పనులు చక్కబెట్టడం స్థూలంగా ఆ సినిమా ఇతివృత్తం. జపాన్ విమానయాన సంస్థ ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ (ఏఎన్‌ఏ), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా)లు ఇప్పుడు ‘అవతార్ ఎక్స్’ పేరుతో చేపట్టిన ఓ ప్రాజెక్టు అవతార్ సినిమా కథకు ఏమాత్రం తీసిపోనిది. కాకపోతే ఇందులో యుద్ధాలు ఏమీ ఉండవు అంతే తేడా. మరి ఏముంటాయి అంటారా? మనిషి భూమ్మీద డ్రిల్లింగ్ మెషీన్‌తో పనిచేస్తూంటే.. ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ల దూరంలో రోబోల రూపంలో ఉండే మనిషి అవతారాల చేతుల్లోని యంత్రాలు పనిచేస్తాయి!
జాబిల్లిపైకి కానివ్వండి.. మనం ఆవాసాలు ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తున్న అంగారకుడిపైన కానివ్వండి ప్రయోగాలు చేయడం ఆషామాషీ కాదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వివిధ దేశాల అంతరిక్ష ప్రయోగాల ద్వారా మనిషి ఇప్పటివరకూ చేరగలిగింది జాబిల్లిపైకి మాత్రమే. భవిష్యత్తులో ఇతర గ్రహాలపైకి మనిషిని పంపే ఆలోచనలు ఉన్నా అవి ఎంత వరకు విజయవంతమవుతాయో తెలియదు. ఈ నేపథ్యంలో జపాన్ సంస్థలు ఓ వినూత్న ఆలోచనతో అవతార్–ఎక్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాయి. ఇతర గ్రహాలపైకి మనిషిని పంపకుండానే.. అవసరమైన అన్ని ప్రయోగాలు చేసేందుకు రోబోలను మాధ్యమంగా ఎంచుకున్నాయి. ఇందుకోసం ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన వర్చువల్ రియాలిటీ, హ్యాప్టిక్ టెక్నాలజీ (స్పర్శ, రుచి, వాసన వంటి అనుభూతులను కలిగించేవి)లను వాడుకోవాలన్నది లక్ష్యం. ఈ ఏడాది మార్చిలోనే భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ఏఎన్‌ఏ ‘అవతార్ విజన్’ పేరుతో జాక్సా ‘జే–స్పార్క్’ పేరుతో ఈ పథకానికి సంబంధించిన ప్రణాళికను విడుదల చేశాయి. తాజాగా ఈ రెండు సంస్థలు కలసి ‘అవతార్ – ఎక్స్’కు శ్రీకారం చుట్టాయి.
ఒయిటాలో అత్యాధునిక పరిశోధనశాల..
అవతార్–ఎక్స్ కోసం జపాన్‌లోని క్యూషూ దీవిలో ఉండే ఒయిటా ప్రాంతంలో ఓ భారీ ప్రయోగశాలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం అభివృద్ధి చేసే కొత్త కొత్త సాంకేతికతలన్నింటి ప్రయోగాలు ఇక్కడే జరుగుతాయి. 2020–25 మధ్యకాలంలో ఈ టెక్నాలజీలన్నింటినీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, భూమి దిగువకక్ష్యల్లో పరిశీలించి చూస్తారు. ఈ సమయంలోనే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ కూడా జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించేందుకు కొత్త ప్రాజెక్టును చేపట్టనుంది.
ఏ టెక్నాలజీలు
మనిషి ఇతర గ్రహాలపై సుఖంగా నివసించేందుకు అవసరమైన అన్ని టెక్నాలజీలను అవతార్ ఎక్స్‌లో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. రోబోలను భూమ్మీద నుంచే నియంత్రిస్తూ అంతరిక్షంలో నిర్మాణాలు ఎలా చేయాలి.. ఆయా గ్రహాలపై ఎగిరే విమానాలను వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా భూమ్మీది పైలట్లు నియంత్రించడం ఎలా.. అన్నవి కూడా ఇందులో ఉంటాయి. భవిష్యత్తులో జాబిల్లి, అంగారక గ్రహాలపై మనిషి ఏవైనా కేంద్రాలను ఏర్పాటు చేస్తే.. వాటిని ఇక్కడి నుంచే నియంత్రించడం ఎలా అన్నది కూడా అవతార్ ఎక్స్‌లో భాగంగా ఉంటుంది. ఆయా గ్రహాలపై ఉన్న అనుభూతిని అందరికీ కలిగించగలిగే టెలీప్రెజెన్స్ టెక్నాలజీల ద్వారా సామాన్య ప్రజలకు వినూత్నమైన వినోదాన్ని అందించొచ్చని జాక్సా, ఏఎన్‌ఏలు భావిస్తున్నాయి. టెలీప్రెజెన్స్ టెక్నాలజీ కోసం ఏఎన్‌ఏ రూ.700 కోట్ల మొత్తంతో అవతార్ ఎక్స్ ప్రైజ్‌తో ఓ పోటీని కూడా ఏర్పాటు చేసింది.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment