
‘సార్’కు ఘన నివాళి
తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ 81వ జయంతి వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా జయశంకర్ జయంతి వేడుకలు
తెలంగాణ భవన్‌లో నివాళులర్పించిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ 81వ జయంతి వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అంతకు ముందు తెలంగాణ భవన్‌కు వచ్చిన హోంమంత్రి నాయిని జయశంకర్‌కు నివాళులు అర్పించారు. తెలంగాణ కల సాకారమైన వేళ జయశంకర్ లేకపోవడం దురదృష్టకరమని.. ఆయన లేనిలోటు పూడ్చలేనిదన్నారు. జయశంకర్ అపురూమైన వ్యక్తి అని, ఆయన బాటలోనే తెలంగాణ నడుస్తుందని రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
ఇక శాసనసభలో మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. జయశంకర్ జయంతి అనగానే, తెలంగాణ ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం, కృషి గుర్తుకువస్తున్నాయని వారు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎదురుగాగల గన్‌పార్కు వద్ద టీజేఏసీ ఆధ్వర్యంలో జయశంక ర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజేఏసీ సంపూర్ణ తెలంగాణ దీక్ష చేపట్టింది. జేఏసీ చైర్మన్ కోదండరాం, వివిధ జేఏసీల నేతలు దేవీప్రసాద్, రఘు తదితరులు జయశంకర్‌కు నివాళి అర్పించారు. సచివాలయంలో సీఎస్ రాజీవ్‌శర్మ, ఉద్యోగులు జయశంకర్‌కు అంజలి ఘటించారు. డీజీపీ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి డీజీపీ అనురాగ్‌శర్మ, సీనియర్ ఐపీఎస్ అధికారులు నివాళులు అర్పించారు.