'బాబు శాపగ్రస్తుడయ్యాడు..'
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వదనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కేంద్ర మంత్రి సుజనాచౌదరికి బాగా తెలుసునని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కేవలం ప్యాకేజీ మాత్రమే వస్తుందన్న విషయంపై వీరిద్దరికీ స్పష్టత ఉందని చెప్పారు. దీనిపై రోజూ రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమకు పట్టిసీమ నుంచి నీళ్లివ్వాలని చంద్రబాబు యత్నించారని, కానీ వరుణుడు సహకరించలేదన్నారు. ఈ విషయంలో ఒకరకంగా చంద్రబాబు శాపగ్రస్తుడని జేసీ వ్యాఖ్యానించారు.
అయినా చెప్పినవన్నీ చేయడానికి చంద్రబాబేమైనా మహాత్ముడా, దేవుడా అని అన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా పాలన చేస్తే చంద్రబాబుకైనా, కేసీఆర్‌కైనా బిహార్‌గతే పడుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్‌లో స్థానం లేదని, అసలు ఆ పార్టీకి కేడర్ ఎక్కడుందని ప్రశ్నించారు. కొద్దో గొప్పో ఏమైనా బలపడే అవకాశం తెలంగాణలో మాత్రమే ఉందన్నారు. నరేంద్ర మోదీపై ప్రజలు అంచనాలకు మించి ఆశలు పెట్టుకున్నారని, అవి నెరవేరకపోయేసరికి బిహార్‌లో బీజేపీని చిత్తుగా ఓడించారని అన్నారు.
ప్రత్యేక రాయలసీమ ఉద్యమంపై విలేకరులు ప్రశ్నించగా.. ప్రజలు తిరస్కరించిన నాయకులే ఇప్పుడు ప్రత్యేక రాయలసీమ ఉద్యమం చేస్తున్నారని, తాను ఏనాడో రాయల తెలంగాణ అడిగానన్నారు. అదేగనుక ఇచ్చి ఉంటే శ్రీశైలం నీళ్లు కావాల్సినన్ని రాయలసీమకు వచ్చేవని చెప్పారు. నాడు ఎవరూ మాట్లాడకుండా ఈరోజు ఏదో రాయలసీమకు అన్యాయం జరిగిందని చెప్పడం తగదన్నారు. అయినా ముఖ్యమంత్రులకు ఎక్కువ మంది నాయకులు భజన చేసి, చప్పట్లుకొట్టే వారే ఉన్నారుగానీ, కనీసం చెవిలోనైనా నిజాలు చెప్పే నాయకులు లేకపోవడం దురదృష్టమని జేసీ వ్యాఖ్యానించారు.