'దేవుడికి, మోదీకి మాత్రమే తెలుసు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై అనంతపురం ఎంపీ, టీడీపీ నాయకుడు జేసీ దివాకర్రెడ్డి మరోసారి తనదైన శైలిలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తుందో ? లేదో ? తెలియదన్నారు. కానీ దేవుడికి, ప్రధాని మోదీకి మాత్రమే తెలుసు అని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం అనంతపురంలో జేసీ దివాకర్రెడ్డి విలేకర్లలో మాట్లాడుతూ... ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ లబ్ది చేకూరుస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని జేసీ దివాకర్రెడ్డి తెలిపారు.
చంద్రబాబు తన రెండు రోజుల పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలో ప్రధానితోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలసి... కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధానితో చంద్రబాబుతోపాటు టీడీపీ ఎంపీలు కూడా భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రధాని ప్రత్యేక హోదా ఇస్తున్నారా ? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు జేసీ దివాకర్ రెడ్డి పై విధంగా స్పందించారు.