ప్రత్యేక హోదా రాదని చంద్రబాబుకు తెలుసు: జేసీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదనే విషయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ముందే తెలుసునని అనంతపురం లోక్సభ సభ్యుడు జేసీ దివాకర్రెడ్డి తెలిపారు. శనివారం విజయవాడలో జేసీ దివాకర్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ఇదే విషయం ఎంపీలు, ఎమ్మెల్యేలందరిని కూడా తెలుసునని ఆయన స్పష్టం చేశారు.
ఈ విషయం తెలిసే చంద్రబాబు రాష్ట్రానికి అదనపు ఆర్థిక సాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలను మభ్య పెట్టవచ్చునని ఈ నాయకులు అనుకుంటున్నారు... కానీ వారికి అంతా తెలుసునని జేసీ దివాకర్రెడ్డి పేర్కొన్నారు.
అధికారంలో లేనప్పుడు ఓ మాట... అధికారంలోని వచ్చిన తర్వాత ఓ మాట మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా బీజేపీపై జేసీ దివాకర్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రత్యేక హోదాపై తాము ఎన్ని సార్లు అడిగినా ... దున్నపోతు మీద వర్షం పడినట్టే అన్నట్లు కేంద్రం వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రజల వాయిస్కు ఈ ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని జేసీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా అన్న అంశం చాలా మందికి అర్థం కాలేదని జేసీ దివాకర్రెడ్డి అన్నారు. నిజం చెప్పాలంటే నాకూ కూడా వంద శాతం తెలియదన్నారు. కానీ ఆబాలగోపాలం మాత్రం ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తోందని జేసీ దివాకర్రెడ్డి గుర్తు చేశారు.