‘మత మార్పిడి బిల్లు’ వెనక మర్మమేమిటీ?
న్యూఢిల్లీ: జార్ఖండ్‌లో ఆవు మాంసాన్ని అత్యంత ప్రీతిపాత్రంగా స్వీకరించే ఆదివాసీలకు దాన్ని దూరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2005లో ఆవు మాంసం నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా జార్ఖండ్ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మత మార్పిడుల నిషేధ చట్టం బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఇంకా దీన్ని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉండడం వల్ల బిల్లును ఆమోదించడం అంత కష్టమేమి కాదు.
మత మార్పిడుల నిషేధ చట్టం అమల్లో ఉన్న రాష్ట్రాల్లోలాగానే ‘మత స్వేచ్ఛ బిల్లు–2017’ అని దీనికి పేరు పెట్టారు. ఇతర రాష్ట్రాల చట్టాల్లోలాగానే ‘ఎల్యూర్‌మెంట్’కు పాల్పడితే శిక్ష విధించాలని బిల్లులో పేర్కొన్నారు. ఎల్యూర్‌మెంట్ అంటే వివరణ ఇవ్వలేదు. స్థూలార్థం తీసుకుంటే ప్రలోభ పెట్టడమైనా, బలవంతం చేయడమైనా ఎల్యూర్‌మెంట్ కిందకు వస్తుంది. జార్ఖండ్‌లో ఎక్కువ మంది ఆదివాసీలు విద్యావకాశాలు చూసి క్రైస్తవం వైపు వెళుతున్నారు. అంటే ఇక్కడ విద్యావకాశాలను పరిగణలోకి తీసుకున్నా ప్రలోభానికి గురిచేయడమే అవుతుంది. ఈ బిల్లులో ‘త్రెట్ ఆఫ్ డివైన్ డిస్‌ప్లెజర్’ అనే పదంను విశ్వసించినా చట్టం కింద శిక్షార్హులే అవుతారు.
క్రైస్తవ మతం ప్రకారం ఈ పదానికి అర్థం క్రీస్తును నమ్మకపోతే దూషణకు గురవుతావని, అందుకు నరకంలో శిక్ష అనుభవిస్తారని అర్థం. ఈ లెక్కన క్రైస్తవంలో చేరడమే శిక్షార్హమైన నేరం అవుతుంది. మాయమాటలు చెప్పి మతం మార్పిడికి ప్రయత్నించరాదు అనే పదాన్ని కూడా బిల్లులో చేర్చారు. హేతువాదుల ప్రకారం ప్రతీ మతం మాయమాటలు చెబుతుంది. ఈ లెక్కన క్రైస్తవం, ఇస్లాం ఏమతం పుచ్చుకున్నా నేరమే అవుతుంది. దేశంలో మత మార్పిడులను నిషేధిస్తూ చట్టం తీసుకరావడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వమే రెండుసార్లు పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టింది. 1955లో ఓ బిల్లుపై లోక్‌సభలో జవహర్‌లాల్ నెహ్రూ మాట్లాడుతూ దేశ పౌరులకు ఎవరికైనా తమకు ఇష్టమైన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ ఉంటుందని, అయితే ఏ మతమైన ప్రజలను ప్రలోభ పెట్టి తమ మతాల్లో చేర్చుకోరాదని అన్నారు.
ఇక్కడ ప్రలోభ పెట్టేవారికి శిక్ష విధించాలంటే అంది సాధ్యమయ్యే పనికాదని, ముందుగా ప్రలోభాలకు సరైన నిర్వచనం ఇవ్వలేమని అన్నారు. మత మార్పిడిలను నిరోధించే చట్టాలను తీసుకరావడం వల్ల అనవసరంగా మెజారిటీ ప్రజలు చిత్ర హింసలకు, శిక్షలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పైగా అనసరంగా పోలీసులకు అదనపు అధికారాలు ఇచ్చినట్లవుతుందని చెప్పారు. ప్రలోభపూరిత మత మార్పిడులను అరికట్టేందుకు ఇప్పుడున్న సాధారణ చట్టాలు సరిపోతాయని నెహ్రూ వాదించారు. అప్పుడు మెజారిటీ సభ్యులు ఆయనతో ఏకీభవించడం వల్ల జాతీయ స్థాయిలో మత మార్పిడి నిరోధక చట్టాలు రాలేదు.
1967లో, తొలిసారిగా ఒడిశాలో అప్పటి స్వతంత్య్ర పార్టీ ప్రభుత్వం మతమార్పిడులను నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ చట్టాలు ఇలాంటి చట్టాలను తీసుకొచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్ కూడా ఎప్పుడో చట్టం తెచ్చినప్పటికీ దానికి సంబంధించిన నియమ నిబంధనలను ఖరారు చేయకపోవడం వల్ల అది అసంపూర్తిగానే మిగిలిపోయింది. పదేళ్ల క్రితమే రాజస్థాన్ ప్రభుత్వం ఇలాంటి చట్టం తీసుకొచ్చినా ఇంతవరకు అది పార్లమెంట్ ఆమోదం పొందలేదు. మత స్వేచ్ఛా చట్టం అన్నప్పటికీ ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రం కూడా మతమార్పిడుల నిషేధ చట్టం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో హిందూ మతస్థులే ఎక్కువగా ఉన్నప్పటికీ ‘సర్న’ అనే ఆదివాసీ మతస్థులు కూడా గణనీయంగానే ఉన్నారు.
ఆ తర్వాత మూడవ స్థానంలో క్రైస్తవులు, నాలుగవ స్థానంలో ముస్లింలు ఉన్నారు. సర్న మతాన్ని ఆచరించే ఆదివాసీల్లో ఎక్కువ మంది కాలక్రమంలో హిందూ మతాచారాలకు మారారు. కొంత మంది విద్యావకాశాల కోసం క్రైసవంలోకి మారారు. ప్రస్తుతం క్రైస్తవంలోనే ఎక్కువ చదువుకున్నవారు ఉన్నారు. మిగిలిన సర్న మతస్థులు క్రైస్తవంలోకి వెళ్లకుండా నిరోధించేందుకే బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆదివాసీలను విడదీయడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వారు విమర్శిస్తున్నారు. హిందూ మతంలోకి మారితే తప్పులేదని, అది మతం కాదని, ఓ జీవన విధానమని వాదిస్తున్న బీజేపీ నేతలు ఉన్నారు.