
జియో సమ్మర్ స్ట్రోక్: ట్రాయ్ వివరణ
జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ నిలుపుదలపై టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ వివరణ ఇచ్చింది.
న్యూఢిల్లీ: జియో సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ నిలుపుదలపై టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ వివరణ ఇచ్చింది. జియో తాజా ఆఫర్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని ట్రాయ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ శుక్రవారం వివరించారు. అందుకే ఈ ఆఫర్ నిలిపివేయాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. పరిశీలన అనంతరం జియో ఆఫర్ రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా లేదని గుర్తించామని పీటీఐకి చెప్పారు.
రిలయన్స్ జియో ఖాతాదారులకు రూ.303 రీచార్జ్‌పై అపరిమిత డేటా వినియోగంతోపాటు ఉచిత ఆఫర్లను అందించిన మూడు నెలల కాంప్లిమెంటరీ ఆఫర్‌ను ఉపసంహరించుకోవాలని ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోను ట్రాయ్ గురువారం ఆదేశించింది. దీనిపై స‍్పందించిన జియో ట్రాయ్ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని చెప్పింది. తమ ఆఫర్ నిబంధనలను లోబడే ఉందని పేర్కొంది.
కాగా అయితే ప్రధాన టలికం కంపెనీలు జియో ఆఫర్లను తీవ్రంగా తప్పుబడుతున్నప్పటికీ ఇప్పటివరకూ సమర్ధిస్తూ వచ్చిన ట్రాయ్ అనూహ్యంగా సమ్మర్ సర్ ప్రైజ్‌ను నిలిపివేయాలని ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. ప్రైమ్ మెంబర్‌షిప్ పథకం రిజిస్ట్రేషన్‌ను గడువును ఏప్రిల్ 15వరకు పొడిగించడంతో పాటు రూ.303 రీచార్జి సేవలను మూడు నెలలపాటు ఉచితంగా అందిస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.