మాజీ సీఎంతో చేతులు కలపడం పెద్దతప్పే
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్.. బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రిపై కల్యాణ్ సింగ్పై విమర్శలు ఎక్కుపెట్టారు. 2009 లోక్సభ ఎన్నికల సమయంలో కల్యాణ్ సింగ్తో చేతులు కలపడం పెద్దతప్పని ములాయం అన్నారు.
సమాజ్వాదీ పార్టీ నేత, మాజీ ఎంపీ భగ్వతి సింగ్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ములాయం.. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న కల్యాణ్ సింగ్తో పొత్తు పెట్టుకోవడం తాను చేసిన పెద్ద పొరపాటని అంగీకరిస్తున్నానని చెప్పారు. ఎన్నికల తర్వాత తమ పార్టీ ఆయనకు దూరమైందని తప్పును ఒప్పుకుని పార్టీకి క్షమాపణలు చెప్పానని ములాయం అన్నారు. 2002లో బీజేపీకి దూరమైన కల్యాణ్ సింగ్ రాష్ట్రీయ క్రాంతి పార్టీ పెట్టారు. 2009 ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ కల్యాణ్ సింగ్ పార్టీతో పొత్తుపెట్టుకుంది. దీనివల్ల తమ పార్టీకి చాలా నష్టం జరిగిందని ములాయం చెప్పారు. కాగా కల్యాణ్ మళ్లీ బీజేపీ గూటికి చేరారు.