షహబుద్దీన్ విడుదల సమయంలో వాళ్లిద్దరూ..
జర్నలిస్టు రంజన్ హత్య కేసులో అనుమానితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు.. ఆర్జేడీ మాజీ నేత షహబుద్దీన్ విడుదల సమయంలో జైలుకు రావడం ఇప్పుడు బీహార్ లో సంచలనం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిందుస్తాన్ జర్నలిస్టు రంజన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మహమ్మద్ కైఫ్ అలియాస్ బంటి, మహమ్మద్ జావేద్ లు పరారీలో ఉన్నారు. షహబుద్దీన్ విడుదల సందర్భంగా ఆయన పక్కనే నిందితులు ఇద్దరూ ఉన్నట్లు మీడియా చానెళ్లలో కనిపించిన విజువల్స్ షాక్ కు గురిచేస్తున్నాయి.
స్థానిక రాజకీయ నాయకులు చేస్తున్న అరాచకాలను జర్నలిస్టు రంజన్ ఎండగట్టినట్లు సమాచారం. దీంతో సంఘ విద్రోహశక్తులు ఆయన్ను బెదిరించాయని, మాట వినకపోవడంతో ఈ ఏడాది మేలో ఆయన్ను చంపేసినట్లు తెలిసింది. షహబుద్దీన్ కు పట్టుకలిగిన ప్రాంతమైన శివన్ లో జరుగుతున్న అరాచకాలపై కూడా రంజన్ ఆర్టికల్స్ రాసినట్లు తెలిసింది. షహబుద్దీన్ పై 40 క్రిమినల్ కేసులున్నాయి. దశాబ్దం కాలంగా జైలు జీవితం అనుభవించిన షహబుద్దీన్ పాట్నా హైకోర్టు బెయిలు మంజూరు చేయడంతో గత శనివారం బయటకు వచ్చారు.
కైఫ్, జావేద్ లకు సంబంధించిన ఫోటో గ్రాఫ్, వీడియోలను సేకరించినట్లు పోలీసులు తెలిపారు. వీరి కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టినట్లు చెప్పారు. విడుదల సమయంలో కైఫ్, జావేద్ లు జైలుకు రావడంపై షహబుద్దీన్ ను విచారిస్తామని శివన్ ఎస్పీ తెలిపారు. తన భర్తను చంపిన వ్యక్తి విజువల్స్ మీడియాలో రావడంపై రంజన్ భార్య స్పందించారు. షహబుద్దీన్ తో బంటి కనిపించడం కన్నా ఆధారాలు మరేం కావాలని పోలీసులను ప్రశ్నించారు?. తాను ఇప్పటికే భయాందోళనల్లో బతుకుతున్నానని, ఇప్పుడు తన పిల్లలకు ఎలాంటి హాని జరుగుతుందేమోనని భయంగా ఉందని వాపోయారు.