జస్టిస్ కర్ణన్ అరెస్ట్
తమిళనాడులో అరెస్టు చేసిన బెంగాల్ పోలీసులు
సాక్షి, చెన్నై: కోర్టు ధిక్కార కేసులో ఆర్నెల్ల జైలుశిక్షను ఎదుర్కొంటున్న కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌ను మంగళవారం పశ్చిమబెంగాల్ సీఐడీ అధికారులు అరెస్టుచేశారు. నెలరోజులకుపైగా ఆచూకీ లేకుండా పోయిన ఆయనను తమిళనాడు లోని కోయంబత్తూరు దగ్గర్లోని మలుమి చ్చంపట్టి గ్రామంలోని ఓ రిసార్టులో సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొద్దిరోజులుగా ఆయన ఇక్కడే తలదాచు కుంటున్నారని సీఐడీ ఉన్నతాధికారి చెప్పారు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులతో కర్ణన్ వాదనకు దిగారని, అరెస్టు చేయకుండా అడ్డుకున్నారని చెప్పారు. తర్వాత కర్ణన్‌ను కస్టడీలోకి తీసుకున్నట్లు చెప్పారు. కర్ణన్‌ను నేడు కోర్టులో హాజరుపరిచాక కోల్‌కతాకు తరలించనున్నట్లు చెప్పారు. కర్ణన్ ఫోన్‌కాల్స్‌ను పసిగట్టిన తర్వాత ముగ్గురు కోల్‌కతా పోలీసుల బృందం గత మూడు రోజులుగా ఇక్కడే మకాంవేసి కర్ణన్ జాడను నిర్ధారించుకున్నారు.
కోర్టు ధిక్కార కేసులో సీజేఐ జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్.. కర్ణన్‌కు ఆర్నెల్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తీర్పు వెలువడిన అదేరోజు చెన్నైకు చేరుకున్న కర్ణన్ ఆ తర్వాత అరెస్టు, జైలు శిక్షను తప్పించుకునేందుకు కనిపించకుండాపోయారు. దీంతో కర్ణన్ అరెస్టు కోసం కోల్‌కతా పోలీసులు తమిళనాడులో గాలింపు తీవ్రంచేశారు. ఎట్టకేలకు మంగళవారం రాత్రి అరెస్టుచేశారు. 1983లో తమిళనాడులో న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించిన ఆయన 2009లో మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 మార్చి 11న కోల్‌కతా హైకోర్టుకు బదిలీఅయ్యారు.