వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి మంగళవారం
ఢిల్లీలో వైఎస్సార్‌సీపీ ఎంపీల నివాళి
న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహనరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో 10, రాజాజీ మార్గ్‌లోని కలాం పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఎంపీ మేకపాటి మాట్లాడుతూ అబ్దుల్ కలాం గొప్ప మార్గదర్శకుడు, శాస్త్రవేత్త, ఉపాధ్యాయుడు అని కొనియాడారు. రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన అనంతరం కూడా దేశ విదేశాల్లోని కళాశాలల్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా బోధనలు చేశారన్నారు.
శాస్త్రసాంకేతిక రంగాల్లోనే కాకుండా ఆర్థికంగా దేశం అభివృద్ధి చెందాలని, పేదవర్గాలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించేవారన్నారు. పేదకుటుంబంలో పుట్టిన కలాం రాష్ట్రపతి స్థాయికి చేరినప్పటికీ తారతమ్యాలు లేకుండా అన్ని వర్గాలతో అనుబంధాన్ని ఏర్పరచుకున్న మహనీయుడని అన్నారు. అబ్దుల్ కలాం నిజమైన బ్రహ్మచారి అన్నారు. నాడు స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తినివ్వగా, నేడు కలాం స్ఫూర్తిప్రదాతగా నిలిచారన్నారు. ఆయన మరణం దురదృష్టకరమని, దేశానికే కాదు ప్రపంచానికీ తీరనిలోటన్నారు. కలాం ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.