
షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ టాప్ హీరోయిన్!
హైదరాబాద్‌లో ఉధృతమైన కత్తియుద్ధం సీన్ చిత్రీకరిస్తుండగా ఆమెకు గాయమై.. తీవ్రంగా రక్తస్రావమైంది.
హైదరాబాద్: బాలీవుడ్ అగ్ర కథానాయిక కంగనా రనౌత్ పెద్ద గండం నుంచి తప్పించుకుంది. ఆమె తాజా సినిమా 'మణికర్ణిక-ద క్వీన్ ఆఫ్ ఝాన్సీ' షూటింగ్ సందర్భంగా ఆమె నుదురుపై తీవ్రమైన కత్తిగాయం అయింది. హైదరాబాద్‌లో ఉధృతమైన కత్తియుద్ధం సీన్ చిత్రీకరిస్తుండగా ఆమెకు గాయమై.. తీవ్రంగా రక్తస్రావమైంది. 'కంగనను వెంటనే సమీపంలోని అపోలో ఆస్పత్రికి తరలించాం. ఆమెను ఐసీసీయూలో చేర్చారు. ఆమె నుదురుపై 15 కుట్లు పడ్డాయి. మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. ఇది చాలా తీవ్రమైన కత్తిగాటు అని, దాదాపు ఆమె ఎముక వరకు తెగిందని వైద్యులు తెలిపారు' అని చిత్రయూనిట్ 'మిడ్-డే' పత్రికకు తెలిపింది.
కత్తియుద్ధం సీన్‌లో డూప్‌ను వాడటానికి నటి కంగన ఒప్పుకోలేదని, ఈ సీన్ కోసం ఎన్నోసార్లు రిహార్సల్ చేసినా.. షూటింగ్‌లో ఈ ఘటన జరిగిందని నిర్మాత కమల్ జైన్ తెలిపారు. నిహార్, కంగన కత్తిపోరు సీన్ చేస్తుండగా నిహార్ కత్తి ముందుకు దూయడంతో కంగన కనుబొమ్మల మధ్య తెగిందని, దీంతో 30 నిమిషాల్లోనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లామని నిర్మాత తెలిపారు. తీవ్ర రక్తస్రావమై.. బాధతో విలవిలలాడుతున్న కంగనను చూసి నిహార్ భయపడిపోయాడని, కానీ కంగన ధైర్యంగా ఏం జరగలేదని అతన్ని సముదాయించిందని వివరించారు. కాగా, ఈ కత్తిగాయం మచ్చ కంగన ముఖంపై కొనసాగే అవకాశముందని ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ తెలిపారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో కంగన కథానాయికగా 'మణికర్ణిక' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.