జీఓ 30 అమలు అసాధ్యం | Kapu protest for OBC status turns violent, train bogies set afire | Sakshi
Sakshi News home page

జీఓ 30 అమలు అసాధ్యం

Published Mon, Feb 1 2016 3:54 AM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM

జీఓ 30 అమలు అసాధ్యం - Sakshi

జీఓ 30 అమలు అసాధ్యం

* కాపు నాయకులే దాన్ని ఇవ్వొద్దన్నారు
* కాపు రిజర్వేషన్లను బీసీలు వ్యతిరేకిస్తున్నారు
* కమిషన్ సిఫారసు చేయకపోతే మేమేం చేయలేం
* ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
* ఖద్దరు బట్టలు వేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజం

సాక్షి, విజయవాడ బ్యూరో: కాపుల రిజర్వేషన్లకు సంబంధించిన జీఓ నంబర్ 30ను అమలు చేయడం అసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు కోర్టు తీర్పులున్నాయని చెప్పారు. తునిలో జరిగిన ఘటనలు కాపులకే నష్టదాయకమని వ్యాఖ్యానించారు.

కాపు ఐక్య గర్జన పరిణామాలపై ఆయన ఆదివారం రాత్రి తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు కావాలని ఇదంతా చేశాయని ఆరోపించారు. తునిలో జరిగిన ఆందోళనలో 25 వాహనాలు, ఒక రైలు కాలిపోయాయని, ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలు, ముగ్గురు ఎస్‌ఐలు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు గాయపడ్డారని చెప్పారు. వారిలో ఒక సీఐ, కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. రెండు పోలీస్ స్టేషన్లు ధ్వంసమయ్యాయన్నారు. ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో 40 ఏళ్లలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు, అమరావతిని ఇలాగే అడ్డుకున్నారని, రాయలసీమలోనూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారని ఆరోపించారు.
 
జీఓ ఇచ్చినా చెల్లదు
కాపులను బీసీల్లో కలపాలని చూస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాపు రిజర్వేషన్లను బీసీలు వ్యతిరేకిస్తున్నారని ఉద్ఘాటించారు. బీసీల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎలా చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. కాపుల రిజర్వేషన్లపై సిఫారసుల కోసం కమిషన్‌ను నియమించామని తెలిపారు. జీఓ నంబర్ 30ని అమలు చేయడం ఎలా సాధ్యమని కాపు నేతలను ప్రశ్నించారు. రిజర్వేషన్లపై ఒక కమిషన్ వేసి, దాని సిఫారసుల ఆధారంగా చేయమని ఈ జీఓలో పేర్కొన్నారని, దానిపైకొందరు కోర్టుకెళ్లారని పేర్కొన్నారు.

బలవంతంగానో, శాంతిభద్రతల సమస్య కారణంగానో దీనిపై నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని, ఒక కమిషన్ వేసి వాళ్ల నివేదిక ప్రకారం చేయాలని సూచించిందని గుర్తుచేశారు. కమిషన్ సిఫారసు చేయకపోతే తాము చేయడానికి ఏమీ ఉండదని తేల్చిచెప్పారు. నిబంధనల ప్రకారం చేయకపోతే ఈ రిజర్వేషన్లపై జీఓ ఇచ్చినా చెల్లదన్నారు. దానిపై తాను తూర్పుగోదావరి జిల్లాలో కాపు నేతలతో మాట్లాడానని, జీఓ ఇవ్వొద్దని, నిబంధనల ప్రకారమే చేయాలని వారు కోరారని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాపుల రిజర్వేషన్లపై ఏం చేసిందని చంద్రబాబు ప్రశ్నించారు.
 
గర్జనలో కాపులు 10 శాతం మందే
వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ వాళ్లే ఇదంతా చేయించారని, వాళ్లకు సంబంధించిన ఆరు, ఏడు వాహనాలను ముందే పంపించారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఒక కుట్ర ప్రకారం ఇదంతా జరిగిందన్నారు.  రైళ్లు తగులబెట్టడం, పోలీసులను కొట్టడం దారుణమన్నారు. ఖద్దరు బట్టలు వేసుకున్న నాయకులు ఫోజులు కొడుతూ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ప్రభుత్వం అంటే అంత చులకనైపోయిందా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కావాలంటే తాను రేపే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, జీఓ ఇస్తానని అది నిలవకపోతే ఏం చేస్తారని ప్రశ్నించారు. కాపుల ఐక్య గర్జనకు ఇతర ప్రాంతాల నుంచే ఎక్కువ మంది వెళ్లారని, కాపులు ఐదు, పది శాతం మంది మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఇకపై సమావేశాలు జరిగితే ఆధార్ కార్డులు చూపిస్తే కానీ లోనికి పంపని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement