సాక్షి, హైదరాబాద్: భారీ స్థాయిలో రాజకీయ సభలు, లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యేందుకు అవకాశం ఉన్న ‘గర్జన’ల వంటి కార్యక్రమాలు, నిరసన ప్రదర్శన వంటివి జరుగుతున్నప్పుడు పోలీసులు, నిఘా వర్గాల ప్రాథమిక దృష్టి ప్రధానంగా మాబ్ కౌంటింగ్ (హాజరయ్యేవారి లెక్కింపు), మాబ్ నిర్వహణలపై ఉండాలి. లక్షలాదిమందికి సంబంధించిన, సెంటిమెంట్‌తో కూడిన, సున్నితమైన అంశాల్లో వీటిపై మరింతగా శ్రద్ధ పెట్టాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. అప్పుడే ఎలాంటి అపశ్రుతులనైనా, అవాంఛనీయ సంఘటనలనైనా నివారించేందుకు అవకాశం ఉంటుంది. కానీ కాపు ఐక్య గర్జన విషయంలో ఇవేవీ జరగలేదు.
నిఘా వర్గాల వైఫల్యం చాలా స్పష్టంగా కన్పిస్తోంది. మాబ్ కౌంటింగ్, మాబ్ నిర్వహణ వంటి అంశాలను పోలీసులు పూర్తిగా విస్మరించిన నేపథ్యంలోనే రైలుకు నిప్పు నుంచి పోలీసుస్టేషన్ల దగ్ధం వరకు ఒకదాని తర్వాత మరొకటిగా ఘటనలు చోటు చేసుకున్నాయన్నది నిర్వివాదాంశం.
సరైన అంచనాలతో సమర్థ నిర్వహణ
సభా వేదిక అయిన తుని సమీపంలోని వి.కొత్తూరుకు ఉన్న ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, సమీపంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు అధికారిక పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడం ద్వారా మాబ్ కౌంటింగ్ చేయాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం సభ ప్రారంభమవుతున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలి.
ఆ ప్రాంత చుట్టుపక్కల ఉన్న టోల్‌గేట్ సిబ్బందితోనూ సంప్రదింపులు జరుపుతూ ఎన్ని వాహనాలు తుని వైపు వచ్చాయి? తదితర అంశాలను ఎప్పటిప్పుడు సమీక్షించాలి. అలాగే రైళ్ళు, ఆర్టీసీ బస్సుల్లో ఎంతమంది వచ్చారనే దానిపై కూడా ఓ అవగాహన ఉండాలి. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలి. కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఏ ప్రాంతం నుంచి వచ్చేవారి మూడ్ ఏరకంగా ఉంది? వారి భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయి? అనేవి అంచనా వేయడానికి స్పెషల్ బ్రాంచ్, ఐడీ పార్టీలను వినియోగిస్తుంటారు. సభకు హాజరయ్యే వారు ఎక్కడైఆన ఒకచోట గుమిగూడకుండా చూడటం, వచ్చిన వారిని వచ్చినట్లు సభాస్థలి వైపు నడిపించడం తదితర చర్యలన్నీ వ్యూహంలో భాగంగా తీసుకుంటారు.
సభాస్థలికి పరిమితికి మించిన జనం వచ్చినప్పుడు మాత్రమే బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల సమీప ప్రాంతాలతో పాటు అధికారిక పార్కింగ్ లాట్స్‌లో అవసరమైన ఏర్పాట్లు చేసి రద్దీని ఎక్కడికక్కడ తాత్కాలికంగా నిలువరిస్తారు. అయితే ఆదివారం భారీ సంఖ్యలో సభకు వచ్చినవారు తుని రైల్వేస్టేషన్‌లోనే ఆగుతున్నా పోలీసు విభాగం పట్టించుకోలేదు. వారి మూడ్, భావోద్వేగాలను అంచనా వేయడంలో నిఘా విభాగం పూర్తిగా విఫలమైంది.
ఓ ఘటన జరిగిన తర్వాత కూడా...
తుని రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకు నిప్పు ఘటన తర్వాత కూడా పోలీసు విభాగం సరైన రీతిలో స్పందించలేదు. కొందరు అధికారులు బాధ్యతారాహిత్యంగా చేసిన ప్రకటనలు, క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసులు సంయమనం కోల్పోయి తీసుకున్న చర్యలు.. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం కల్పించాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిఘా విభాగం నిద్దర!
Published Mon, Feb 1 2016 4:07 AM | Last Updated on Mon, Jul 30 2018 6:29 PM
Advertisement
Advertisement